-

వైద్య సహాయకురాలిగా హెథర్‌ నైట్‌

30 Mar, 2020 00:30 IST|Sakshi

ఎన్‌హెచ్‌ఎస్‌లో వలంటీర్‌గా చేరిన ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌

లండన్‌: ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్‌ నైట్‌ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్‌హెచ్‌ఎస్‌ వలంటీర్‌ పథకంలో నేను చేరాను.

ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నాను. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్‌ నైట్‌ వివరించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ సెమీస్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.  అనంతరం హెథర్‌ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్‌ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు