ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?

7 Sep, 2019 16:02 IST|Sakshi
1999 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒలోంగా (ఫైల్‌)

హెన్రీ ఒలోంగా.. క్రికెట్‌ అభిమానులకు చిరపరిచితమైన పేరు. ముఖ్యంగా టీమిండియా ప్రేమికులకు అతడు కచ్చితంగా గుర్తుంటాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వే చేతిలో భారత్‌ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు అతడే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమికి కారకుడయ్యాడు. అయితే 2003 వరల్డ్‌కప్‌లో అతడు చేసిన పని ఒలోంగా క్రీడాజీవితానికే కాదు స్వదేశానికి దూరమయ్యేలా చేసింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే నేతృత్వంలో జింబాబ్వేలోని అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేతికి నల్ల రిబ్బను కట్టుకుని బరిలోకి దిగినందుకు అతడు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మాతృభూమికి శాశ్వతంగా దూరమయ్యాడు. రాబర్ట్‌ ముగాబే మరణించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నుంచి స్కైప్‌లో అతడు మీడియాతో మాట్లాడాడు.

తన క్రీడాజీవితాన్ని తలక్రిందులు చేసిన ముగాబే మరణం పట్ల తనకేమి సంతోషం లేదని పేర్కొన్నాడు. ‘ఆఫ్రికాలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా ముగాబే పరిగణించబడడం చాలా బాధాకరం. ఇంగ్లీషు భాషపై మంచి పట్టువుండడంతో ఆయన తన చరిత్రను అనుకూలంగా రాయించుకున్నారు. దయార్ధ్ర హృదయుడిగా, సౌమ్యుడిగా, సంపదను అందరికీ సమానంగా పంచిన మంచి మనిషిగా కీర్తించుకున్నారు. నిజంగా ఇవన్నీ చేసుంటే నెల్సన్‌ మండేలా మాదిరిగా జనం హృదయాల్లో నిలిచేవార’ని ఒలోంగా వ్యాఖ్యానించాడు. శ్వేత జాతీయల భూములను లాక్కుకోవడం, మానవ హక్కుల ఉల్లంఘన కేసులను ప్రభుత్వం నీరుగార్చడాన్ని వ్యతిరేకిస్తూ 2003 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఆండీ ఫ్లవర్‌తో కలిసి నల్లరిబ్బన్‌ ధరించి ఒలంగా మైదానంలోకి దిగాడు. ఫలితంగా అతడు ఎన్నో కష్టాలు చవిచూడాల్సి వచ్చింది.


జింబాబ్వే నాయకులు అతడి నిరసనను ఖండించారు. ఒలోంగాను కుట్రదారుడిగా వర్ణించారు. వివాదాలు చుట్టుముట్టడంతో ప్రియురాలు అతడిని వదిలేసింది. దుండగుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో జింబాబ్వే గూఢచారి విభాగానికి చెందిన అధికారి సహాయంతో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు ఒలోంగా వెల్లడించాడు. ఓ క్రికెట్‌ క్లబ్‌ యజమాని తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడని తెలిపాడు. ఆపద సమయంలో ముగాబే అనుచరుల నుంచి తనను కాపాడిన వారందరికీ ఈ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ధన్యవాదాలు తెలిపాడు. జింబాబ్వేతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని.. స్వదేశానికి తిరిగివచ్చే ఆలోచన లేదని, అడిలైడ్‌లో అంతా బాగుందని స్పష్టం చేశాడు.

అది ఆండీ ఆలోచన
హరారేలో జరిగిన మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బను కట్టుకుని మైదానంలోకి దిగాలన్న ఆలోచన ఆండీ ఫ్లవర్‌కు వచ్చిందని ఒలోంగా తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు ‘గ్లాడియేటర్‌’  ఇంగ్లీషు సినిమా పలుమార్లు చూసినట్టు వెల్లడించాడు. ముగాబే ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రపంచం ముందుంచడానికే నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపామన్నాడు. ఆండీ ఫ్లవర్‌ సూచన పాటించకపోయివుంటే తన జీవితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే తన నిర్ణయం పట్ల ఎటువంటి విచారం లేదన్నాడు.

16 ఏళ్ల తర్వాత కూడా జింబాబ్వేలో ప్రజాస్వామ్యం ఖూనీ గురించి మిగతా దేశాలు గళం విప్పకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. జింబాబ్వే క్రికెట్‌ జట్టును నిషేధిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మిగతా ప్రపంచం మౌనం వహించడం దిగ్భ్రంతికి గురిచేసిందని ఒలంగా వాపోయాడు. జింబాబ్వే జాతీయ క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించిన తొలి నల్లజాతీయుడిగా గుర్తింపు పొందిన ఒలోంగా ఉత్తుంగ కెరటంలా ఎగిసి టెస్టు, వన్డేలు కలిసి 126 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఒలోంగా ఇప్పుడు గాయకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియన్‌ రియాలిటీ షోలో కనిపించి అందరినీ అలరించాడు. (చదవండి: ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా