'వాళ్లు జంతువుల్లాగా ప్రవర్తించారు'

22 Jan, 2020 14:02 IST|Sakshi

2007లో తనపై ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించడంపై దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్సమెన్‌ హర్షలే గిబ్స్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. అప్పట్లో మీపై రెండు టెస్టుల నిషేధం ఎందుకు విధించారని తన అభిమానులు అడిగిన ప్రశ్నకు గిబ్స్‌ సమాధానమిచ్చాడు.' పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఆ జట్టు మద్దతుదారుల్లో కొందరు రౌడీల్లాగా ప్రవర్తించారు. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన నా భార్య, కొడుకును వారు కూర్చున్న స్థానాల నుంచి బలవంతంగా పంపించారు. ఆ సమయంలో గ్రౌండ్‌లో ఉన్న నేను నా సహచరులతో ' పాక్‌ అభిమానులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు' అంటూ చెప్పానని' గిబ్స్‌ తెలిపాడు.

ఈ సంఘటన తర్వాత తన మీద ఐసీసీ రెండు టెస్టుల నిషేధం విధించిదని, తర్వాత నిషేధం విషయమై ఐసీసీని కలిసినా నా విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించిందని పేర్కొన్నాడు. దానికి కారణం తాను వాడిన పదాలు మైదానంలోని స్టంప్‌ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయని గిబ్స్‌ పేర్కొన్నాడు. కాగా ఈ విషయాన్ని ఇంతకుముందే గిబ్స్‌ తన ఆటోబయోగ్రఫీ 'టు ది పాయింట్‌'లోనూ వివరించాడు. పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్‌ అభిమానులు తమ ప్రవర్తనతో మా జట్టు ఆటగాళ్లకు చికాకు తెప్పించారని,తన కళ్ల ముందే తన కొడుకు రషార్డ్‌, భార్య లిసెల్‌ను వారు కూర్చున్న సీట్ల నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారని గిబ్స్‌ తన బుక్‌లో రాసుకొచ్చాడు.(ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది: రవిశాస్త్రి)

మా జట్టు ఆటగాళ్లంతా ఇదే విషయమై చర్చించుకుంటుంటే అవన్నీ స్టంప్‌ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయని బుక్‌లో పేర్కొన్నాడు. 'నేను ముస్లిం జాత్యహంకారినని, అందుకే ముస్లింలపై అలాంటి వ్యాఖ్యలు చేశానని ఆరోపించారు. కానీ అది నిజం కాదు. నలుగురు ముస్లిం అత్తలతో పాటు 10 మంది ముస్లిం స్నేహితులు ఉన్న నా జీవితంలో నేను జాత్యహంకారిగా ఎలా ఉండగలను చెప్పండి' అంటూ తన ఆత్మకథలో వివరించాడు. అంతర్జాతీయ కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టుల్లో 6167 పరుగులు, 248 వన్డేల్లో 8094 పరుగులు, 23 టీ20ల్లో 400 పరుగులు సాధించాడు. జట్టు తరపున ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ స్థానంలో ఆడి ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. కాగా గిబ్స్‌ 2010లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా