ఐపీఎల్‌ : పైసల్‌ ఎక్కువ.. పరుగులు తక్కువ!

2 May, 2018 17:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐపీఎల్‌ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్‌ లీగ్‌. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు సొంత జట్టుకు ఆడటానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏడాది పాటు జాతీయ జట్టుకు ఆడితే రాని డబ్బు సరిగ్గా ఒకటిన్నర నెల ఆడితే తమ ఖాతాల్లో జమ అవుతుంది. దీంతోనే ఐపీఎల్‌లో ఆడేందుకు అన్ని క్రికెట్‌ దేశ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారు. ఒక్కో ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇప్పటికే ఐపీఎల్‌ లీగ్‌లో సగం షెడ్యూల్‌ పూర్తి అయింది. కానీ ఈ సీజన్‌ వేలంలో కొందరు ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడయ్యారు. కానీ వారు ఆటలో దారుణంగా విఫలమయ్యారు. వారు ఎవరంటే.. 

డీఆర్సీ షార్ట్‌ : ఆస్ట్రేలియాకు చెందిన షార్ట్‌ బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బిగ్‌బాష్‌లో లీగ్‌లో సంచలనం కలిగించిన ఈ యువ కెరటం ఐపీఎల్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 97.01 స్ట్రైక్‌ రేట్‌తో కేవలం 65 పరుగులు చేశాడు.

గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ : టీ20 క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బరిలో దిగితే ప్రత్యర్థికి చుక్కలు చూపించేస్తాడు. కానీ గత రెండు సీజన్‌ల నుంచి మాత్రం తన ప్రభావం చూపించలేక పోతున్నాడు. కింగ్స్‌ పంజాబ్‌ను వదిలి ఢిల్లీ తరపున ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా మొత్తం చేసిన పరుగులు 126, స్ట్రైక్‌ రేటు 159.49. ఈ ఆసీస్‌ ఆటగాడిని ఏడు కోట్ల రూపాలయకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

జయదేవ్‌ ఉనద్కట్‌ : బౌలర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఉనద్కత్‌ ఒకడు. గత సీజన్‌లో పూణె తరపున సంచలన బౌలింగ​ చేసిన ఇతడు ఈ సీజన్‌లో మాత్రం తన బౌలింగ్‌ పదును చూపెట్టలేక పోతున్నాడు. గత సీజన్‌లో ఉనద్కత్‌ బౌలింగ్‌ చూసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 11.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 7మ్యాచ్‌లు ఆడి కేవలం 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకనామీ 10.18గా ఉంది.

కీరన్‌ పోలార్డ్‌ : క్రీజులో దిగంగానే బంతిని బౌండరీ తరలించడంలో వెస్టిండీస్‌ ఆటగాళ్లు ముందుంటారు. ఈ కోవలో కీరన్‌ పోలార్డ్‌ ఒకరు. ముంబై తరపున ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తుంటాడు. చాలా సార్లు ఒంటిచేత్తో ముంబైకి విజయాలు అందించాడు. కానీ ఈ సారి దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా 108.57 స్ట్రైక్‌ రేటుతో కేవలం 76 పరుగులు చేశాడు.

ఆరోన్‌ ఫించ్‌ : ఆస్ట్రేలియాకు చెందిన ఫించ్‌ను కింగ్స్‌ పంజాబ్‌ 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక పోయాడు. ఆరు మ్యాచ్‌లు ఆడగా మొత్తం 24 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేటు 150గా ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు