‘ప్రాక్టీస్’లో బాదేశారు

9 Jan, 2016 01:30 IST|Sakshi
‘ప్రాక్టీస్’లో బాదేశారు

ఆసీస్ పర్యటనలో భారత్ శుభారంభం
వెస్టర్న్ ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
చెలరేగిన కోహ్లి, ధావన్  నేడు ప్రాక్టీస్ వన్డే మ్యాచ్
 
 పెర్త్:
ఆస్ట్రేలియా పర్యటనను ధోని సేన భారీ గెలుపుతో మొదలు పెట్టింది. వన్డే సిరీస్‌కు ముందు సన్నాహకంగా జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 74 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌ను చిత్తు చేసింది. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
  విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (46 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 14.1 ఓవర్లలోనే 149 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వెస్టర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రెవిస్ బర్త్ (60 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... పేసర్ బరీందర్ శరణ్ తలా 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో భారత్... ఇదే జట్టుతో తలపడుతుంది.
 
 భారీ భాగస్వామ్యం...
 టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ (6) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ధావన్, కోహ్లి కలిసి తమదైన శైలిలో ఆడారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ తమ టి20 నైపుణ్యం, అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మూడీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదిన కోహ్లి  35 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు.
 
  ధావన్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్లో కూడా 22 పరుగులు రాబట్టిన భారత్... అదే ఓవర్లో కోహ్లి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ధావన్, అజింక్య రహానే (2) అవుటైనా, చివర్లో ధోని (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు.
 
 ఆకట్టుకున్న శరణ్
 భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) జట్టును ఆరంభంలోనే బరీందర్ శరణ్ కట్టి పడేశాడు. తన రెండో ఓవర్లో షార్ట్ (5)ను అవుట్ చేసిన అతను, మూడో ఓవర్లో బొసిస్టో (1)ను వెనక్కి పంపాడు. ఒకవైపు బర్త్ చక్కటి షాట్లతో దూసుకుపోయి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నా... మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు.
 
 స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిగా కట్టడి చేయడంతో డబ్ల్యూఏ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. జడేజా తన వరుస ఓవర్లలో 2 వికెట్లు తీయగా, అక్షర్ కూడా అదే తరహాలో 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బర్త్ చివరకు అజేయంగా నిలిచాడు.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 6; శిఖర్ ధావన్ (సి) షార్ట్ (బి) కెల్లీ 74; విరాట్ కోహ్లి (సి) ఇంగ్లిస్ (బి) నికోలస్ 74; ధోని (నాటౌట్) 22; అజింక్య రహానే (సి) ఇంగ్లిస్ (బి) డఫీల్డ్ 2; గుర్‌కీరత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192.
 వికెట్ల పతనం: 1-12; 2-161; 3-173; 4-185.
 
 బౌలింగ్: డఫీల్డ్ 4-0-21-1; నికోలస్ 4-0-44-1; కెల్లీ 4-0-31-1; మూడీ 3-0-40-0; కానర్ 3-0-34-0; ముర్‌హెడ్ 2-0-17-0.
 వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బర్త్ (నాటౌట్) 74; షార్ట్ (సి) అశ్విన్ (బి) శరణ్ 5; బొసిస్టో (సి) అశ్విన్ (బి) శరణ్ 1; ఇంగ్లిస్ (సి) శరణ్ (బి) జడేజా 11; హాబ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; మోర్గాన్ (సి) రహానే (బి) అక్షర్ 3; కెల్లీ (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 2; నికోలస్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 118.
 వికెట్ల పతనం: 1-20; 2-26; 3-61; 4-73; 5-83; 6-92.
 బౌలింగ్: శరణ్ 4-0-24-2; ఉమేశ్ 3-0-23-0; రిషి ధావన్ 3-0-22-0; జడేజా 3-0-13-2; అశ్విన్ 4-0-20-0; అక్షర్ 3-0-13-2.
 

>
మరిన్ని వార్తలు