‘హిజాబ్' వద్దంటే ఆడలేం!

25 Sep, 2014 01:36 IST|Sakshi

మ్యాచ్‌ను అప్పగించిన ఖతార్ మహిళల బాస్కెట్‌బాల్ జట్టు

 ఇంచియాన్: ఆరంభంనుంచి సజావుగా సాగుతున్న 17వ ఆసియా క్రీడల్లో బుధవారం కొత్త వివాదం చెలరేగింది. ఇది మతపరమైంది కావడం నిర్వాహకులను కాస్త ఇబ్బంది పెట్టింది. వివరాల్లోకెళితే...ఆసియా క్రీడల మహిళల బాస్కెట్‌బాల్ పోటీల్లో తొలి మ్యాచ్‌లో ఖతార్ జట్టు మంగోలియాతో తలపడాల్సి ఉంది. ఖతార్ జట్టు సభ్యులు హిజాబ్ (తలనుంచి ఛాతీ వరకు కవర్ చేస్తూ ముస్లిం మహిళలు కట్టుకునే స్కార్ఫ్)తోనే కోర్టులోకి అడుగు పెట్టారు. అయితే నిర్వాహకులు దీనికి నిబంధనలు అంగీకరించవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తమ విశ్వాసాలకు విరుద్ధమంటూ స్కార్ఫ్‌ను తొలగించేందుకు సిద్ధపడని ఖతార్ జట్టు మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. దాంతో నిర్వాహకులు మ్యాచ్‌ను ప్రారంభించకుండా మంగోలియా జట్టు గెలిచినట్లుగా ప్రకటించారు.  ఇంచియాన్ ఆసియా క్రీడల్లో బాస్కెట్‌బాల్ మినహా ఇతర అన్ని క్రీడల్లో హిజాబ్‌కు అనుమతిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు