టోక్యో ఎంత దూరం?

23 Jul, 2019 05:40 IST|Sakshi

టైమింగ్‌ మరింత మెరుగైతేనే ఒలింపిక్స్‌కు హిమ దాస్‌ అర్హత

తన బెస్ట్‌ను అధిగమిస్తే క్వాలిఫై

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు ఖరారు కాని బెర్త్‌  

పంతొమ్మిదేళ్ల యువ తరంగం... భారత మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ వరుసగా ట్రాక్‌పై అద్భుతాలు సాధిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని... అంతంతమాత్రంగా ఉన్న అథ్లెటిక్స్‌లో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఫలితంగా క్రీడాభిమానులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు హిమ ఘనతను కీర్తిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికపరంగా వెనుకబడిన వర్గానికి చెందిన నేపథ్యంతో పాటు ఇటీవల అసోం వరద బాధితుల కోసం పెద్ద మనసుతో ఆమె చేసిన సాయం కూడా ఆ అమ్మాయి స్థాయిని పెంచింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలకు సంబంధించి హిమ దాస్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మన దేశానికి తొలి పతకం అందించగలదని, ఇటీవలి పంచ స్వర్ణాలు ఆమె సత్తా చాటాయని అంతా భావిస్తున్నారు. కాకపోతే ఇటీవలి ప్రదర్శన ఆమె కెరీర్‌లో అత్యుత్తమమేమీ కాదు. టోక్యోకు అర్హత సాధించటానికి సరిపోదు కూడా..!! ఒకవేళ ఆమె తన మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను చేరుకుంటే, లేక అధిగమిస్తే మాత్రం... పతకాన్ని ఆశించవచ్చు. ఆ విశ్లేషణ ఇదిగో...!

ఇటీవల గెలిచిన స్వర్ణాలు...
200 మీటర్లు
► పోజ్నాన్‌ గ్రాండ్‌ప్రి (పోలండ్‌) : 23.65 సెకన్లు
► కుట్నో మీట్‌ (పోలండ్‌) : 23.97 సెకన్లు
► క్లాడ్నో మీట్‌ (చెక్‌ రిపబ్లిక్‌) : 23.43 సెకన్లు
► తాబోర్‌ మీట్‌ (చెక్‌ రిపబ్లిక్‌) : 23.25 సెకన్లు

400 మీటర్లు
► నోవ్‌ మెస్టో (చెక్‌ రిపబ్లిక్‌) : 52.09 సెకన్లు

ఏ స్థాయి ఈవెంట్‌లంటే...
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) గుర్తింపు పొందిన ఈవెంట్లలో ‘ఎ’ నుంచి ‘ఎఫ్‌’ వరకు ఆరు రకాలు స్థాయిలున్నాయి. వీటిలో హిమ పతకాలు గెలిచిన ఐదులో రెండు ‘ఎఫ్‌’ కేటగిరీవి కాగా... మరో మూడు ‘ఇ’ కేటగిరీవి.  

ఎవరెవరు పాల్గొన్నారు...
భారత అథ్లెట్ల బృందానికి పోలండ్‌లోని స్పాలాలో రెండు నెలల ప్రత్యేక శిక్షణ శిబిరం జరుగుతోంది. ప్రాక్టీస్‌తో పాటు రేస్‌లో అనుభవం కోసం స్పాలాకు చుట్టుపక్కల జరిగే ఈవెంట్లలో మనవాళ్లు పాల్గొంటున్నారు. హిమ గెలిచిన 400 మీటర్ల పరుగులో టాప్‌–5 అందరూ భారత అథ్లెట్లే ఉన్నారు. మిగతా దేశాలవారు కొందరు పాల్గొన్నా వారెవరికీ హిమకంటే మెరుగైన ర్యాంక్‌ లేదు.

హిమ ప్రదర్శన ఎలా ఉంది?  
అథ్లెటిక్స్‌లో పతకాల్ని పక్కనబెడితే... టైమింగే ముఖ్యం. దీని ప్రకారం చూస్తే హిమ ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సి ఉందనే చెప్పాలి. ఎందుకంటే 200 మీటర్ల పరుగులో నమోదు చేసిన నాలుగు టైమింగ్‌లు కూడా ఆమె కెరీర్‌ అత్యుత్తమ టైమింగ్‌తో (23.10 సెకన్లు) పోలిస్తే చాలా వెనకబడినట్లే. 400 మీటర్ల పరుగులోనైతే కెరీర్‌ బెస్ట్‌ 50.79 సెకన్లతో పోలిస్తే 1.30 సెకన్ల తేడా అంటే చాలా చాలా ఎక్కువ!

తాజా ప్రదర్శన ఉపయోగపడదా...
అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్‌ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్‌! ఈ రెండే అత్యుత్తమ ఈవెంట్లు. ఇక్కడ చూపిన ప్రతిభనే క్రీడా ప్రపంచం గుర్తిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 నుంచి దోహాలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. దీనికి ఐఏఏఎఫ్‌ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు 23.02 సెకన్లు (200 మీటర్లు), 51.80 సెకన్లుగా (400 మీటర్లు) ఉన్నాయి. క్వాలిఫికేషన్‌కు సెప్టెంబర్‌ 6 చివరి తేదీ. 200 మీటర్ల పరుగులో వచ్చే నెలలో మరో రెండు మీట్‌లు ఉండటంతో హిమకు ఇంకా అవకాశం ఉంది. 400 మీటర్ల పరుగులో మాత్రం ఆమెకు మరో ఈవెంట్‌ లేదు. దాంతో ఆమె క్వాలిఫై కానట్లే! తాజాగా పతకాలు గెలిచిన మీట్‌లలోనే ప్రత్యర్థులతో సంబంధం లేకుండా హిమ తన అత్యుత్తమ ఆటతీరు కనబరిచి ఉంటే క్వాలిఫై అయ్యేదేమో!!. కాకపోతే అది సాధ్యం కాలేదు.  

ఒలింపిక్స్‌పై ఆశలు...
టోక్యో ఒలింపిక్స్‌కు చాలా సమయం ఉంది. ట్రాక్‌పై టైమింగ్‌ ప్రకారమే కాకుండా మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు. అయితే ర్యాంకింగ్‌కు సంబంధించి ఉండే గణాంకాలు, లెక్కల కారణంగా చివరి వరకు చాలా గందరగోళం ఉంటుంది. కాబట్టి అథ్లెట్లు ఎక్కువగా టైమింగ్‌పైనే దృష్టి పెడతారు. 22.80 సెకన్లు (200 మీటర్లు), 51.35 సెకన్లు (400 మీటర్లు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా నిర్ణయించారు. ఇందులో 200 మీటర్లలో హిమ చాలా మెరుగవ్వాలి. 400 మీ. విషయంలో మాత్రం గతంలో ఇంతకంటే బెస్ట్‌ టైమింగ్‌ నమోదు చేసింది కాబట్టి అది స్ఫూర్తినివ్వవచ్చు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో వెన్ను నొప్పితో ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి మధ్యలోనే తప్పుకున్న హిమ దాస్‌ ఇటీవలే కోలుకుంది. అదే క్రమంలో తాజా యూరోప్‌ ఈవెంట్లలో పాల్గొన్నది. మెరుగైన టైమింగ్‌ కోసం తన పని తాను చేసుకుపోతోంది. ఇదే దారిలో వెళితే మున్ముందు తన టైమింగ్‌ను మెరుగుపర్చుకుని, మరిన్ని పతకాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. సహజ ప్రతిభ కలిగిన హిమ అద్భుత ఆటతో క్వాలిఫై కావటం, పతకాల ఆశల్ని సజీవంగా ఉంచగలగటం... అసాధ్యమైతే కాదు.
 

మరిన్ని వార్తలు