పాక్ సెంచరీల మోత

11 Nov, 2014 00:42 IST|Sakshi
పాక్ సెంచరీల మోత

అబుదాబి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు దుమ్మురేపే ఆటతీరును ప్రదర్శిస్తోంది. రెండో రోజు సోమవారం సీనియర్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ (141 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు), మిస్బా ఉల్ హక్ (162 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ శతకాల సహాయంతో పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 170.5 ఓవర్లలో మూడు వికెట్లకు 566 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అజహర్ అలీ (215 బంతుల్లో 87; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు.

తొలి రోజు సెంచరీ హీరో అహ్మద్ షెహజాద్ (371 బంతుల్లో 176; 17 ఫోర్లు; 1 సిక్స్) అండర్సన్ బౌలింగ్‌లో బౌన్సర్ తలకు తాకి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. సిటీ స్కాన్‌లో అతడి స్కల్‌కు ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ పాక్ పలు విశేషాలను నమోదుచేసింది. టెస్టు క్రికెట్‌లో తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ 80కి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి.

అలాగే తన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో యూనిస్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా... అటు మిస్బా కూడా వరుసగా మూడో సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లను పాక్ డిక్లేర్ చేసినట్టయ్యింది. ఇక కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు