హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ రాజీనామా 

11 Jul, 2020 02:05 IST|Sakshi

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు మొహమ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారమే అహ్మద్‌ తన రాజీనామా పత్రాన్ని హెచ్‌ఐకి అందజేయగా... శుక్రవారం సమావేశమైన హెచ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు దాన్ని ఆమోదించింది. అతని స్థానంలో హాకీ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు జ్ఞానేంద్రో నిగోంబమ్‌ (మణిపూర్‌)ను నియమించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే జాతీయ క్రీడా నిబంధనలకు వ్యతిరేకంగా 2018లో అహ్మద్‌ ఎన్నిక జరిగిందని పేర్కొన్న భారత క్రీడా మంత్రిత్వ శాఖ అతన్ని అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని గతంలోనే పేర్కొంది.

నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఆఫీస్‌ బేరర్‌గా వ్యవహరించేందుకు అవకాశముంది. ముస్తాక్‌ అహ్మద్‌ 2010–2014 వరకు హాకీ ఇండియా కోశాధికారిగా, 2014–2018 వరకు కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2018–2022 కాలానికిగానూ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలను చెబుతున్నప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు