భారత హాకీ జట్ల గోల్స్‌ వర్షం 

26 Apr, 2018 01:21 IST|Sakshi

 థాయ్‌లాండ్‌పై 25–0తో, సింగపూర్‌పై 14–0తో విజయం  

బ్యాంకాక్‌: యూత్‌ ఒలింపిక్స్‌ కోసం జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో భారత పురుషులు, మహిళల హాకీ జట్లు అసాధారణ ప్రదర్శనతో హోరెత్తించాయి. పురుషుల జట్టు 25–0తో ఆతిథ్య థాయ్‌లాండ్‌పై, మహిళల జట్టు 14–0తో సింగపూర్‌పై భారీ విజయాలు సాధించాయి. పూల్‌ ‘బి’లో జరిగిన మహిళల పోరులో సంగీత కుమారి (2, 8, 15, 17, 21, 28వ ని.) ఆరు గోల్స్‌ చేయగా, లాల్రేమిసియామి (7, 17, 21వ ని.) మూడు గోల్స్‌ చేసింది. మిగతా వారిలో ముంతాజ్, దీపిక చెరో 2 గోల్స్‌ చేయగా, ఇషికా చౌదరి ఒక గోల్‌ సాధించింది.

పురుషుల విభాగంలో జరిగిన పోరులో భారత జట్టులో మొహమ్మద్‌ అలీషాన్‌ (4, 10, 17, 20, 25, 29వ ని.) ఆరు గోల్స్, రాహుల్‌ కుమార్‌ (2, 12, 18, 22, 23వ ని.) ఐదు గోల్స్‌తో చెలరేగారు. రవిచంద్ర మొయిరంగ్తెమ్‌ (10, 15, 20, 29వ ని.), కెప్టెన్‌ వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (7, 9, 27, 28వ ని.) చెరో నాలుగు గోల్స్‌ చేశారు. గోల్‌ కీపర్‌ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు గోల్‌ కొట్టడం విశేషం. నేడు జరిగే పోటీల్లో పురుషుల జట్టు జపాన్‌తో, మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడతాయి.   

మరిన్ని వార్తలు