భారత్‌...  పాంచ్‌ పటాకా 

29 Nov, 2018 01:29 IST|Sakshi

 తొలి మ్యాచ్‌లో ఘనంగా బోణీ

దక్షిణాఫ్రికాపై 5–0తో జయభేరి

రెండు గోల్స్‌తో మెరిసిన సిమ్రన్‌జిత్‌ సింగ్‌  

పురుషుల హాకీ ప్రపంచకప్‌  

ఎప్పుడో 43 ఏళ్ల క్రితం అందుకున్న ప్రపంచ కప్‌ను ఈసారి సొంతగడ్డపై తప్పకుండా సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు అందుకుతగ్గ ప్రదర్శనతో బోణీ చేసింది. గోల్స్‌ మీద గోల్స్‌  కొడుతూ... ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ... సాధికార ఆటతో గోల్‌ పోస్ట్‌పై పదేపదే దాడులకు దిగి ప్రత్యర్థిని చిత్తు చేసింది. పలు పెనాల్టీ   కార్నర్‌లు చేజారినా పట్టు జారకుండా చూసుకుంటూ జయభేరి మోగించింది.   

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచ కప్‌ వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. పూల్‌ ‘సి’లో భాగంగా బుధవారం ఇక్కడి కళింగ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అద్భుత గోల్‌తో మ్యాచ్‌ మొదట్లోనే ఫార్వర్డ్‌ మన్‌దీప్‌ సింగ్‌ (10వ నిమిషంలో) అందించిన ఆధిక్యాన్ని ఆ వెంటనే ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (12వ నిమిషంలో) మరింత పెంచగా... ఆ తర్వాత మిడ్‌ ఫీల్డర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (43వ, 46వ నిమిషాల్లో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (45వ నిమిషంలో) జట్టు స్కోరును ప్రత్యర్థికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లారు. భారత్‌ జోరు ముందు అచేతనంగా మారిపోయిన సఫారీలు కనీసం ఖాతా తెరవలేకపోయారు. భారత్‌ తదుపరి మ్యాచ్‌ను డిసెంబర్‌ 2న బెల్జియంతో ఆడుతుంది.

 

ఆసాంతం ఆధిక్యం... 
కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌... బాక్స్‌ ఏరియా లోపల మన్‌దీప్‌కు చక్కటి పాస్‌ను అందించడంతో మ్యాచ్‌ మూడో నిమిషంలోనే భారత్‌కు గోల్‌ అవకాశం దక్కింది. మన్‌దీప్‌ దీనిని చేజార్చినా... 10వ నిమిషంలో స్కోరు చేశాడు. భారత ఆటగాళ్ల డ్రాగ్‌ఫ్లిక్‌ను దక్షిణాఫ్రికా కీపర్‌ రసీ పీటర్స్‌ అడ్డుకోగా, వెనక్కు వచ్చిన బంతిని మన్‌దీప్‌ సమయస్ఫూర్తితో నెట్‌లోకి కొట్టాడు. మరో రెండు నిమిషాల్లోనే సిమ్రన్‌జిత్‌ పాస్‌ను ఆకాశ్‌దీప్‌ గోల్‌గా మలిచాడు. 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ విఫలం కాకుంటే ఆధిక్యం మరింత పెరిగేదే. తొలి రెండు భాగాలు సఫారీ రక్షణ శ్రేణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన టీమిండియా... మూడో భాగంలో మరింత దూకుడుగా కనిపించింది. ఫలితంగా నాలుగు నిమిషాల వ్యవధిలో మూడు ఫీల్డ్‌ గోల్స్‌ నమోదయ్యాయి. వీటిలో రెండు సిమ్రన్‌జిత్‌ చేయడం విశేషం. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాకు రెండుసార్లు గోల్‌ అవకాశాలు వచ్చినా భారత గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. అప్పటికే భారీ ఆధిక్యంలో ఉన్న భారత్‌ విజయం ఖాయమైంది. 


కెనడాపై బెల్జియం గెలుపు... 
ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో మూడో ర్యాంకర్‌ బెల్జియం 2–1తో కెనడాను ఓడించింది. బెల్జియం తరఫున ఫెలిక్స్‌ డినయిర్‌ (3వ నిమిషంలో), కెప్టెన్‌ థామస్‌ బ్రీల్స్‌ (22వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. పెనాల్టీ కార్నర్‌ను నెట్‌లోకి పంపి మార్క్‌ పియర్సన్‌ (48వ నిమిషంలో) కెనడా ఖాతా తెరిచాడు. మరే ఆటగాడి నుంచి అతడికి సహకారం అందకపోవడంతో జట్టు ఓటమి పాలైంది.  

ప్రపంచకప్‌లో నేడు 
అర్జెంటీనా(vs)స్పెయిన్‌  సా.గం. 5 నుంచి 
న్యూజిలాండ్‌(vs) ఫ్రాన్స్‌ రాత్రి గం. 7 నుంచి 
స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు