చక్‌ దే ఇండియా...!

27 Nov, 2018 01:08 IST|Sakshi
ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్ల కెప్టెన్‌లతో భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర్‌ దేవాలయం ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

నేటి నుంచి హాకీ ప్రపంచకప్‌ 

తొలి రోజు ప్రారంభోత్సవం

రేపటి నుంచి మ్యాచ్‌లు

‘హ్యాట్రిక్‌’పై ఆస్ట్రేలియా గురి

ఆశల పల్లకిలో భారత్‌

పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో భారత్‌... ఎవరికీ సాధ్యంకాని ‘హ్యాట్రిక్‌’ టైటిల్స్‌ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా... అరంగేట్రంలోనే అదరగొట్టే ఆటతీరు ప్రదర్శన చేయాలనే తపనతో చైనా... అందని ద్రాక్షగా ఊరిస్తోన్న టైటిల్‌ను ఒడిసి పట్టాలని స్పెయిన్‌... ఆర్థిక సమస్యలతో అసలు పోటీలో పాల్గొంటామా లేదా అనే గందరగోళ  పరిస్థితులను అధిగమించిన పాకిస్తాన్‌... యూరోప్‌ ఆధిపత్యాన్ని చాటుకోవాలని నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం... రియో ఒలింపిక్స్‌లో తాము సాధించిన స్వర్ణం గాలివాటం కాదని నిరూపించాలని  అర్జెంటీనా... ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ పండుగకు  మంగళవారం తెరలేవనుంది. తొలి రోజు  ప్రారంభోత్సవ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. బుధవారం నుంచి అసలు సమరం మొదలవుతుంది.  

భువనేశ్వర్‌: ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్‌ కాలక్రమేణా తమ ప్రాభవం కోల్పోయింది. ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్‌ గేమ్స్‌లో, చాంపియన్స్‌ ట్రోఫీలో అడపాదడపా మెరుపులు తప్ప... విశ్వ వేదికపై టీమిండియా విశ్వరూపాన్ని ప్రదర్శించి చాలా కాలమైంది. తొలుత ఆధిక్యం సంపాదించడం... ఆ తర్వాత చివరి క్షణాల్లో దానిని చేజార్చుకోవడం... మన జట్లకు అలవాటుగా మారిపోయింది. విదేశీ కోచ్‌లు వచ్చిపోయినా... స్వదేశీ కోచ్‌లను నియమించుకున్నా... భారత జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులు వేసేందుకు ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడకు కొత్త ఊపిరి తెచ్చేందుకు సీనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ రూపంలో సువర్ణావకాశం వచ్చింది. సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ సెమీఫైనల్‌ చేరితే ఆ దిశగా కొత్త ఊపిరి వచ్చినట్టవుతుంది.  

ఈసారి ఏ స్థానమో? 
ఎనిమిదేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఎనిమిదో స్థానం... నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో తొమ్మిదో స్థానం పొందిన భారత్‌ ఈసారి ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత సాధించింది. పూల్‌ ‘సి’లో దక్షిణాఫ్రికా, కెనడా, బెల్జియం జట్లతో కలిసి భారత్‌ ఉంది. దక్షిణాఫ్రికా, కెనడా జట్లపై విజయంపై అనుమానాలు లేకున్నా... బెల్జియంతో జరిగే మ్యాచ్‌ అసలు పరీక్షగా నిలువనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే పూల్‌ ‘టాపర్‌’ హోదాలో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమిస్తే టీమిండియాకు సెమీస్‌ బెర్త్‌ ఖాయమవుతుంది. వెటరన్‌ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌... ‘డ్రాగ్‌ ఫ్లికర్‌’ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌... ఫార్వర్డ్‌ శ్రేణిలో మన్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌... డిఫెన్స్‌లో మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లాక్రా ప్రదర్శనపై భారత అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత రెండు ప్రపంచకప్‌లలో టైటిల్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఈసారీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.  

భారత హాకీ జట్టు: మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), పీఆర్‌ శ్రీజేశ్, కృషన్‌ పాఠక్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, సిమ్రన్‌జిత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, కొతాజిత్, చింగ్లేన్‌సనా, సురేందర్, లలిత్‌ ఉపాధ్యాయ్, నీలకంఠ శర్మ, సుమీత్, వరుణ్‌ కుమార్, అమిత్‌ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హారేంద్ర సింగ్‌ (కోచ్‌). 

నేడు సెలవు... 
ప్రపంచకప్‌ హాకీ    ప్రారంభోత్సవ నేపథ్యంలో భువనేశ్వర్‌లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 1.30 వరకే పని చేస్తాయి. సినీ కళాకారులు ఎ.ఆర్‌.రెహ్మాన్, షారూఖ్‌ ఖాన్, ప్రభాస్, మాధురీ దీక్షిత్‌ తదితరులు ప్రారంభ వేడుకలకు 
హాజరుకానున్నారు.   

పాక్‌ అత్యధికంగా... 
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 12 సార్లు పాల్గొన్న పాకిస్తాన్‌ జట్టు అతధికంగా నాలుగు సార్లు (1971, 1978, 1981, 1994) విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా (1986, 2010, 2014); నెదర్లాండ్స్‌ (1973, 1990, 1998) మూడేసిసార్లు చాంపియన్‌గా నిలిచాయి. జర్మనీ రెండుసార్లు (2002, 2006) రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుపొందగా... భారత జట్టు (1975లో) ఏకైకసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. 

భారత్‌... ఒక్కసారే
ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రపంచకప్‌లోనూ ఆడిన నాలుగు జట్లలో ఒకటైన భారత ప్రదర్శన ఈ మెగా ఈవెంట్‌లో అంత గొప్పగా లేదు. తొలి మూడు ప్రపంచకప్‌లలో (1971, 1973, 1975) టాప్‌–3లో నిలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్కసారి కూడా మళ్లీ టాప్‌–3కి చేరలేకపోయింది. ఓవరాల్‌గా 91 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 39 మ్యాచ్‌ల్లో గెలిచింది. 41 మ్యాచ్‌ల్లో ఓడింది. 11 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. మొత్తం 186 గోల్స్‌ నమోదు చేసి... 178 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు సమర్పించుకుంది.  

విశేషాలు 

►13   ఇప్పటివరకు జరిగిన  ప్రపంచకప్‌ల సంఖ్య 

►25 ఒక్కసారైనా ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన జట్లు

►4 సగటున మ్యాచ్‌లో నమోదైన గోల్స్‌ 

►4 భారత్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్‌ మాత్రమే ఇప్పటివరకు జరిగిన  ప్రతీ ప్రపంచకప్‌లో పాల్గొన్నాయి.  

►93 అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు నెదర్లాండ్స్‌ 

► 64 అత్యధిక విజయాలు  సాధించిన జట్టు ఆస్ట్రేలియా 

► 569 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లు 

► 2276 ఈ మెగా ఈవెంట్‌లో  నమోదైన మొత్తం గోల్స్‌ 

► 276 అత్యధిక గోల్స్‌ చేసిన  జట్టు ఆస్ట్రేలియా 

భారత జట్టు లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ 
►నవంబరు 28: దక్షిణాఫ్రికాతో రా.గం. 7 నుంచి 
►డిసెంబరు 2: బెల్జియంతో రా.గం. 7 నుంచి 
►డిసెంబరు 8: కెనడాతో రా.గం. 7 నుంచి 

► మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు