చక్ దే ఇండియా

3 Dec, 2015 23:51 IST|Sakshi
చక్ దే ఇండియా

హాకీ వరల్డ్ లీగ్ సెమీస్‌లో భారత్
 క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై 2-1తో విజయం
 30 సంవత్సరాల తర్వాత బ్రిటన్‌ను ఓడించిన భారత్
 
 రాయ్‌పూర్: ఆట అంటే ఇది.. పోరాటం అంటే ఇలా చేయాలి. లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని భారత్... హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) టోర్నీ నాకౌట్ దశలో మాత్రం సంచలనం సృష్టించింది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోన్న ప్రపంచ 4వ ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌కు అద్భుతంగా చెక్ పెట్టింది. దీంతో గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్ 2-1తో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. 30 ఏళ్ల తర్వాత (1985) బ్రిటన్‌పై టీమిండియా గెలవడం విశేషం.
 
 లీగ్ దశలో ఒకే ఒక్క పాయింట్‌తో భారత్ పూల్-బిలో చివరి స్థానంతో సరిపెట్టుకోగా, పూల్-ఎలో బ్రిటన్ రెండు విజయాలు, రెండు డ్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీని వీఆర్ రఘునాథ్ (19వ నిమిషంలో) గోల్‌గా మలిస్తే, తల్విందర్ సింగ్ (39వ నిమిషం) స్కోరును డబుల్ చేశాడు. సిమోన్ మాంటెల్ (52వ ని.) బ్రిటన్‌కు ఏకైక గోల్ అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కీలక సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.
 
  బ్రిటన్ బంతిని ఎక్కువ శాతం ఆధీనంలో ఉంచుకున్నా గోల్స్ చేయడంలో విఫలమైంది. ఆరు పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఆరంభంలో రెండు క్వార్టర్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా చివరి 10 నిమిషాల్లో ఆడిన ఆట మ్యాచ్‌కే హైలెట్. ఆఖరి రెండు నిమిషాల్లో బ్రిటన్ రెండు పెనాల్టీలు సాధించినా.. భారత డిఫెన్స్ ముందు అవి వృథా అయ్యాయి. శనివారం జరిగే సెమీస్‌లో భారత్.. బెల్జియంతో తలపడుతుంది.
 

మరిన్ని వార్తలు