కల నిజమామోగా..!

5 Jul, 2015 00:11 IST|Sakshi
కల నిజమామోగా..!

 హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం
 వర్గీకరణ మ్యాచ్‌లో 1-0తో జపాన్‌పై గెలుపు


 35 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత
 మూడున్నర దశాబ్దాల కల... మన తరంలో కనీసం ఒక్కసారైనా చూడగలామా అనుకున్న ఘనత... భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం సాధించడం ద్వారా వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌కు భారత జట్టు అర్హత సాధించింది. అయితే అధికారికంగా మాత్రం అక్టోబర్‌లోనే ఇది నిర్ధారణ అవుతుంది.

 

యాంట్‌వర్ప్ (బెల్జియం): తమ కలను నిజం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఆఖరి అవకాశాన్ని భారత అమ్మాయిలు సద్వినియోగం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే... తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనుకున్న ఫలితాన్ని సాధించారు. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత జట్టు ఐదో స్థానాన్ని దక్కించుకుంది. శనివారం 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1-0 గోల్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. ఆట 13వ నిమిషంలో రాణి రాంపాల్ భారత్‌కు ఏకైక గోల్‌ను అందించింది.
 
  మరోవైపు ‘రియో’ ఒలింపిక్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తమకూ విజయం తప్పనిసరి కావడంతో జపాన్ జట్టు చివరి సెకను వరకు తీవ్రంగా పోరాడింది. అయితే భారత గోల్‌కీపర్ సవిత అద్వితీయ ప్రతిభ జపాన్ ఆశలను ఆవిరి చేసింది. కనీసం ఆరుసార్లు జపాన్ క్రీడాకారిణుల గోల్ షాట్స్‌ను సవిత సమర్థంగా నిలువరించింది. చివరి క్వార్టర్‌లో జపాన్ ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్‌లను సంపాదించినా సవిత రూపంలో ఉన్న అడ్డుగోడను ఛేదించలేకపోయింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకపోరులో భారత్ 2-1తో జపాన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని జపాన్ తహతహలాడినా వారి ఆశలను భారత్ మరోసారి వమ్ము చేసింది.
 
 ఆరంభం నుంచే సమన్వయంతో కదులుతూ దూకుడుగా ఆడిన భారత్ 13వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. లిలిమా మింజ్ ముందుకు సాగుతూ తన సహచరిణి వందన కటారియాకు పాస్ ఇచ్చింది. వందన కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో జపాన్ గోల్‌కీపర్ అడ్డుకోగా... బంతి సర్కిల్‌లోనే ఉంది.
 
 అక్కడే ఉన్న రాణి రాంపాల్ కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో భారత్ ఖాతాలో గోల్ చేరింది. ఆ తర్వాత భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకుంది. మరోవైపు జపాన్ స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే భారత రక్షణపంక్తి అంతే పట్టుదలగా పోరాడటంతో జపాన్ ఆశలు నెరవేరలేదు. మ్యాచ్ ముగియడానికి 25 సెకన్ల ముందు జపాన్‌కు పెనాల్టీ కార్నర్ వచ్చినా సవిత దానిని నిర్వీర్యం చేసింది.
 
 ‘మా అందరికీ ఇదో గొప్ప ఘనత. ఈ క్షణాల కోసం మేమెంతో కష్టపడ్డాం. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంద్వారా భారత్‌లో మళ్లీ మహిళల హాకీకి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాం.’              

- రాణి రాంపాల్
 
 ‘రియో’ క్వాలిఫయింగ్ ఇలా..
 వచ్చే ఏడాది బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల మహిళల హాకీ ఈవెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి.  హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ల (వాలెన్సియా, యాంట్‌వర్ప్) ద్వారా ఏడు జట్లు.. కాంటినెంటల్ టోర్నీల (ఆసియా క్రీడ లు, పాన్ అమెరికన్ గేమ్స్, యూరో హాకీ చాంపియన్‌షిప్, ఆఫ్రికా కప్, ఓసియానియా కప్) ద్వారా ఐదు జట్లు అర్హత పొందుతాయి.  అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిబంధనల ప్రకారం 2014 డిసెంబరు ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్ టాప్-40లో లేకపోవడం... పాన్ అమెరికన్ గేమ్స్‌కు కూడా అర్హత సాధించకపోవడంతో ‘రియో’ ఒలింపిక్స్‌లో బ్రెజిల్ మహిళల జట్టుకు ఆడే అవకాశం చేజారింది.
 ఎఫ్‌ఐహెచ్ నిబంధనల ప్రకారం... కాంటినెంటల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టు హాకీ వరల్డ్ లీగ్‌లో టాప్-3లో నిలిస్తే ఆ స్థానాన్ని వేరే జట్టుతో భర్తీ చేస్తారు. 2014 ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా విజేత హోదాలో నేరుగా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. యాంట్‌వర్ప్ హాకీ వరల్డ్ లీగ్‌లోనూ కొరియా ఫైనల్‌కు చేరింది. దాంతో వాలెన్సియా టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన మరో జట్టు అర్జెంటీనాకు పాన్ అమెరికన్ గేమ్స్‌లో ఆడకుండానే ‘రియో’ బెర్త్ ఖాయమైంది.
 
  ‘వాలెన్సియా’ టోర్నీలో టాప్-4లో నిలిచిన బ్రిటన్, చైనా, జర్మనీ, అర్జెంటీనా... ‘యాంట్‌వర్ప్’ టోర్నీలో టాప్-3లో నిలిచిన నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఆసియా క్రీడల విజేత హోదాలో దక్షిణ కొరియా ఇప్పటివరకు అధికారికంగా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందాయి.  మిగిలిన నాలుగు కాంటినెంటల్ టోర్నీల (పాన్ అమెరికన్ గేమ్స్, యూరో హాకీ చాంపియన్‌షిప్, ఆఫ్రికా కప్, ఓసియానియా కప్) ద్వారా నాలుగు విజేత జట్లకు అవకాశం ఉంటుంది.
 
 అయితే ఈ కాంటినెంటల్ టోర్నీల్లో విజేతగా నిలిచే అవకాశమున్న జట్లు (ఆఫ్రికా మినహా) ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఫలితంగా హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన జట్లకు ‘రియో’ బెర్త్‌లు ఖాయమవుతాయి. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ‘యాంట్‌వర్ప్’ టోర్నీలో ఐదో స్థానం పొందడంతో ‘రియో’ టికెట్ దక్కడం లాంఛనప్రాయమే. అయితే అక్టోబరులో ఓసియానియా కప్ ముగిశాక ఇది అధికారికంగా ఖరారు అవుతుంది.


 

మరిన్ని వార్తలు