భారతరత్నకు ధ్యాన్చంద్ పేరు సిఫారసు

12 Aug, 2014 15:24 IST|Sakshi
భారతరత్నకు ధ్యాన్చంద్ పేరు సిఫారసు

న్యూఢిల్లీ: భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డుకు కేంద్ర హోం శాఖ హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ పేరును సిఫారసు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీరెన్ రిజ్జు ఈ విషయాన్ని లోక్సభలో తెలిపారు. వివిధ వర్గాల నుంచి వినతులను పరిశీలించిన అనంతరం భారతరత్న అవార్డుకు ధ్యాన్చంద్ పేరును సిఫారసు చేస్తూ ప్రధాని కార్యాలయానికి పంపినట్టు చెప్పారు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని కార్యాలయం సహాయం మంత్రి జితేందర్ సింగ్ తిరస్కరిచారు. గతేడాదే కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్చంద్ పేరును సిఫారసు చేసినా చివర్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు భారతరత్న ప్రకటించారు.

ప్రపంచ అత్యున్నత హాకీ ఆటగాడిగా మన్ననలందుకున్న ధ్యాన్చంద్ 1905లో జన్మించారు. ధ్యాన్చంద్ ప్రాతినిధ్యం వహించిన కాలంలో 1928-1936 మధ్య భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. అప్పట్లో భారత్ ప్రపంచ హాకీని శాసించింది. 1948లో రిటైరయిన ధ్యాన్చంద్ పద్మభూషణ్ సహా పలు అవార్డులు స్వీకరించారు. 79 ఏళ్ల వయసులో ధ్యాన్చంద్ 1979లో కన్నుమూశారు. కేంద్ర క్రీడల శాఖ  ధ్యాన్చంద్ గౌరవార్థం ఆయన పేరు మీద అవార్డు స్థాపించింది. అంతేగాక హాకీ గ్రేట్ జన్మదినం ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినంగా ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు