క్రికెట్‌ వద్దు.. 21 ఏళ్లకే ఆటకు గుడ్‌బై

2 Oct, 2018 21:26 IST|Sakshi

పైలెట్‌ కావడానికే మొగ్గు చూపిన హాంగ్‌కాంగ్‌ కుర్రాడు

క్రికెటర్‌ కావడం అతని కల కాదు. అయినా, దేశం తరపున ఆడడానికి చదువుకు రెండేళ్లు స్వస్తి పలికి మరీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మామూలుగా అయితే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఎవరైనా క్రికెటర్‌గా కొనసాగడానికే మొగ్గుచూపుతారు. కానీ, హాంగ్‌కాంగ్‌కు చెందిన 21 ఏళ్ల కుర్రాడు క్రిస్టోఫర్‌ కార్టర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్ననాటి కల విమాన పైలట్‌ కావడం కోసం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌గా సేవలందిస్తున్న కార్టర్‌ 2015 నవంబర్‌లో హంగ్‌కాంగ్‌ క్రికెట్‌ జట్టుకి ఎంపికయ్యాడు. మూడేళ్ల తన కెరీర్‌లో 11 వన్డేలు, 10 టీ20ల్లో ఆడాడు. వన్డేల్లో 114 (బెస్ట్‌ 43) పరుగులు, టీ20ల్లో 55 (బెస్ట్‌ 17) పరుగులు చేశాడు. ఇదిలాఉండగా.. క్రిస్టోఫర్‌ ఇటీవల జరిగిన ఆసియాకప్‌ టోర్నీలో కూడా పాల్గొన్నాడు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో హాంగ్‌కాంగ్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. హాంగ్‌కాంగ్‌లో జన్మించిన కార్టర్‌ పెర్త్‌ (ఆస్ట్రేలియా)లో పెరిగాడు. అడిలైడ్‌లో 55 వారాల పైలట్‌ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. మరో ఏడాదిలో క్రిస్టోఫర్‌  తన డ్రీమ్‌లో ‘తేలియాడ బోతున్నాడు’.

మరిన్ని వార్తలు