సింధు రెండో‘సారీ’

27 Nov, 2017 01:36 IST|Sakshi

హాంకాంగ్‌ ఓపెన్‌లో మళ్లీ రన్నరప్‌

ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓటమి

కౌలూన్‌ (హాంకాంగ్‌): బ్యాడ్మింటన్‌ సీజన్‌లోని చివరి సూపర్‌ సిరీస్‌ టోర్నీ హాంకాంగ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. వరుసగా రెండో ఏడాది ఆమె రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 18–21, 18–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి.

 ఈ సంవత్సరం సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌తో సింధు ఈ సీజన్‌ను ముగిస్తుంది.  చివరిసారి గతేడాది రియో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు చేతిలో ఓడిన తై జు యింగ్‌ ఆ తర్వాత ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన హాంకాంగ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ తై జు యింగ్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తై జు యింగ్‌ వ్యూహాత్మక ఆటతీరు ముందు సింధు ప్రణాళికలు పనిచేయలేదు. తొలి గేమ్‌ ఆరంభంలోనే 3–0తో, ఆ తర్వాత 7–2తో ఆధిక్యంలోకి వెళ్లిన తై జు యింగ్‌ అదే దూకుడుతో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 12–12 వద్ద తై జు యింగ్‌ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.
 

>
మరిన్ని వార్తలు