క్వార్టర్ లో సైనా,శ్రీకాంత్

21 Nov, 2014 00:29 IST|Sakshi
క్వార్టర్ లో సైనా,శ్రీకాంత్

విదేశీ గడ్డపై భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, శ్రీకాంత్‌లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. తమ అద్వితీయ ప్రదర్శనతో హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించగా... సింధు మాత్రం నిరాశపర్చింది.

* సింధుకు చుక్కెదురు  
* హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్

హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, పి.వి.సింధు నిరాశపర్చింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ తన జైత్రయాత్రను కొనసాగించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సైనా 21-16, 21-13తో ప్రపంచ 14వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై విజయం సాధించింది. 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో 5-5తో స్కోరు సమమైన తర్వాత హైదరాబాద్ అమ్మాయి వెనుతిరిగి చూడలేదు. 17-16 స్కోరు ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సైనా వరుస పాయింట్లతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
 
నిరాశపర్చిన సింధు

మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ సింధు 17-21, 21-13, 11-21తో ప్రపంచ 48వ ర్యాంకర్ నొజోమి ఒక్‌హరా (జపాన్) చేతిలో ఓడింది. ఈ మ్యాచ్ గంటకు పైగా సాగింది. తొలి గేమ్‌లో 4-3 వద్ద నొజోమి వరుసగా 8 పాయింట్లు నెగ్గింది. అయితే ఈ దశలో సింధు పోరాట పటిమను చూపి ఆధిక్యాన్ని 17-19కు తగ్గించినా గేమ్‌ను చేజార్చుకుంది. ఇక రెండో గేమ్‌లో వ్యూహాలను మార్చిన హైదరాబాదీ 6-2, 12-5తో ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు దీన్ని కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడింది. విరామం వరకు సింధు 11-10 ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ దశలో నొజోమి వరుసగా 11 పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

శ్రీకాంత్ హవా
పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ శ్రీకాంత్ హవా కొనసాగించాడు. 21-19, 23-21తో ప్రపంచ 29వ ర్యాంకర్ తనంగ్‌సుక్ సెన్సోమ్‌బూన్స్‌క్ (థాయ్‌లాండ్)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో హైదరాబాద్ కుర్రాడు ఆకట్టుకున్నాడు. 10-2, 11-3తో ఆధిక్యం సంపాదించాడు. అయితే స్కోరు 14-5 ఉన్న దశలో సెన్సోమ్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గడంతో పాటు 15-15తో సమం చేశాడు. కానీ పట్టు విడవకుండా పోరాడిన శ్రీకాంత్ 16-16 తర్వాత వరుసగా మూడు... ఆ తర్వాత మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను ముగించాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్ ఒకే ఒక్కసారి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 18-13 ఆధిక్యంలో నిలిచాడు. ఇక ఇక్కడి నుంచి ప్రతి పాయింట్‌కు ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. 21-21 ఉన్న దశలో శ్రీకాంత్ రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
 
శ్రీకాంత్ @ 10
న్యూఢిల్లీ: ఇటీవల చైనా ఓపెన్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన శ్రీకాంత్... కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను నమోదు చేశాడు. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అతను ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌కు ఎగబాకాడు. పారుపల్లి కశ్యప్ 17వ, హెచ్.ఎస్.ప్రణయ్ 24వ స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో సైనా ఒక్క స్థానం ఎగబాకి 4వ ర్యాంక్‌లో నిలిచింది. సింధు 10వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 19వ ర్యాంక్‌లో ఉంది.

మరిన్ని వార్తలు