షాయ్‌ హోప్‌ సరికొత్త రికార్డు

22 Dec, 2019 15:16 IST|Sakshi

కటక్‌:  వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు వేల పరుగులు సాధించడం ద్వారా నయా రికార్డును లిఖించాడు. టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో  వన్డేలో హోప్‌ 35 పరుగుల వద్ద ఉండగా మూడు వేల వన్డే పరుగుల మార్కును అందుకున్నాడు. ఫలితంగా వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

హోప్‌కు ఇది 67వ వన్డే ఇన్నింగ్స్‌.  ఫలితంగా బాబర్‌ అజామ్‌ను హోప్‌ అధిగమించాడు. పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల్ని సాధిస్తే.. హోప్‌ ఒక ఇన్నింగ్స్‌ ముందుగానే ఆ మార్కును చేరాడు. కాగా, వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా మూడు వేల పరుగులు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా(57 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. ఆ తర్వాత స్థానాన్ని హోప్‌ ఆక్రమించగా, అజామ్‌ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక వెస్టిండీస్‌ తరఫున వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా హోప్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు మూడు వేల వన్డే పరుగులకు 35 పరుగుల దూరంలో ఉన్న హోప్‌.. దాన్ని సునాయాసంగానే అందుకున్నాడు.

షమీ బౌలింగ్‌లో రెండో  వికెట్‌గా..
భారత్‌తో మూడో వన్డేలో హోప్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ వేసిన 20 ఓవర్‌ రెండో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. 42 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద ఉండగా షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్‌ బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు ఎవిన్‌ లూయిస్‌(21) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన తన తొలి ఓవర్‌లో లూయిస్‌ ఔటయ్యాడు.15 ఓవర్‌ ఆఖరి బంతికి నవదీప్‌ షైనీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. వెస్టిండీస​ 24 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు