‘లారా.. నీ రికార్డును ఏదో ఒక రోజు బ్రేక్‌ చేస్తా’

5 Dec, 2019 10:26 IST|Sakshi

అడిలైడ్‌: టెస్టు క్రికెట్‌లో విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత స్కోరును బద్దలు కొట్టే రోజు తనకు మళ్లీ వస్తుందని ఆసీస్‌ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్టులో వార్నర్‌ 335 పరుగులతో అజేయంగా నిలువగా... ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో లారా రికార్డును చెరిపేసే అవకాశాన్ని కోల్పోయాడు. టెస్టు జరిగిన సమయంలో లారా వ్యాపార పనులమీద అడిలైడ్‌లోనే ఉన్నాడు. అప్పుడే విండీస్‌ లెజెండ్‌ స్పందిస్తూ వార్నర్‌ తన రికార్డును బద్దలు కొడతాడని ఆశించానన్నాడు. 300 చేసిన బ్యాట్స్‌మన్‌కు 400 చేయడమెలాగో తెలుసని ఉత్తేజపరుస్తూ వ్యాఖ్యానించాడు.

ఆ సమయంలో లారాతో కలిసి దిగిన ఫొటోనూ తాజాగా వార్నర్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘దిగ్గజ బ్యాట్స్‌మెనే స్వయంగా నన్ను కలవడం గొప్ప విషయం. అతని రికార్డును బ్రేక్‌ చేసే  అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది’ అని ఆ ఫొటోకు వ్యాఖ్య జతచేశాడు. తమ వెస్టిండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ చేసిన 365 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును 36 ఏళ్ల తర్వాత లారా ఇంగ్లండ్‌ (1994)పై బద్దలు కొట్టాడు. ఈ స్కోరును మాథ్యూ హేడెన్‌ (381 – జింబాబ్వేపై) అధిగమించగా...కొద్ది రోజులకే 2004లో  ఇంగ్లండ్‌పైనే 400 పరుగులతో లారా కొత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది. 

>
మరిన్ని వార్తలు