ఐపీఎల్‌ ఫైనల్‌ ‘ఫిక్స్‌’ చేశారా?

24 May, 2018 15:46 IST|Sakshi

సాక్షి, ముంబై: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో ఫైనల్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఢీకొట్టబోతున్నాయి.. అదేంటీ కోల్‌కతా నైట్‌రైడర్‌ ఎపుడు, ఎలా ఫైనల్‌కి వెళ్లిందనుకుంటున్నారా? హాట్‌ స్టార్‌ రూపొందించిన ఓ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇదే సందేహం వస్తుంది. ఇంతకీ సదరు వీడియోలో ఏముందంటే.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నట్టు రూపొందించారు. 

క్వాలిఫయర్‌-1లో విజయం సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు మాత్రమే ఇప్పటి వరకు ఫైనల్‌ చేరుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుని.. వాంఖేడే స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. అలాంటపుడు క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరగకుండానే హాట్‌స్టార్‌ కోల్‌కతా జట్టు  ఫైనల్‌ చేరినట్లు వీడియో రూపొందించడంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. రెండవ ఫైనలిస్ట్‌ కోల్‌కతా అని ఎలా చెబుతారని, ఇదంతా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని విపరీతంగా కామెంట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు