ప్రత్యర్థి హేళన.. ద్రావిడ్‌ సమాధానం ఎలాగంటే...

17 Dec, 2017 09:52 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : అది 2001 ఈడెన్‌ గార్డెన్‌ మైదానం. ఆస్ట్రేలియాతో టెస్ట్‌ మ్యాచ్‌. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 445 పరుగులు చేయగా.. భారత్‌ కేవలం 171 రన్స్‌కే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. ఆటగాళ్ల పేలమైన ఫామ్‌.. పైగా 274 పరుగులతో వెనుకబడి ఉంది. మ్యాచ్‌ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్‌, ద్రావిడ్‌ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌.. ఆపై బంతితో హర్భజన్‌ సింగ్ చేసిన మ్యాజిక్‌ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. అనూహ్యమైన ఆ ఇన్నింగ్స్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఓ అద్భుతంగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు. 

ఇక మ్యాచ్‌లో ద్రావిడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్‌ కు క్యూ కట్టిన క్రమంలో ద్రావిడ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ద్రావిడ్‌ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మరీ దారుణమైన ప్రదర్శన ఆయన ఇచ్చారు. అందుకే ఆయన్ని ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్‌ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్‌ వా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఏం ద్రావిడ్‌.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్‌ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వెళ్లిపోయాడు. 

లక్ష్మణ్ కు జత కలిసిన ద్రావిడ్‌.. ఆట స్వరూపమే మారిపోయింది. బౌలర్లు ఎందరు మారుతున్నా... చెమట చిందించినా లాభం లేకపోయింది. ద్రావిడ్‌-లక్ష్మణ్‌ ద్వయం చితకబాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ను ఇద్దరూ ఓ ఆటాడేసుకున్నారు. వీరోచిత బ్యాటింగ్‌ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ 657 పరుగులు చేసింది. ఆపై భజ్జీ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలటంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. 

తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ్‌ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ సమయంలో నా ఫామ్‌ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే. గతం, భవిష్యత్‌ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే.  వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం.  ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు. ’’ అని ద్రావిడ్‌ సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు.  

కాగా, ఈడెన్‌ గార్డెన్స్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం కూడా అందుకుంది. 

మరిన్ని వార్తలు