హర్మన్‌ ఫేక్‌ సర్టిఫికేట్స్‌ సంగతేంటి?

15 Jan, 2019 21:01 IST|Sakshi

ముంబై : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ యువ ఆటగాళ్లు ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వారి కెరీర్‌ను ప్రశ్నార్థకంలో పడేశాయి. వారిపై ఏకంగా ఏడాది నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యవహారంలో బీసీసీఐ అధికారుల మధ్య వాడి వేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పాండ్యా, రాహుల్‌లపై నిషేధం విధిస్తే.. ఫేక్‌ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందిన మహిళా టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సంగతి ఏంటనే విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. వారు కేవలం వ్యాఖ్యలు మాత్రమే చేశారని, హర్మన్‌ ఏకంగా నకిలీ పత్రాలతో ఉద్యోగం సంపాదించిందని, పైగా ఆమె మహిళా టీ20 కెప్టెన్‌గా కొనసాగుతుందనే చర్చజరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు హర్మన్‌పై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు పాండ్యా, రాహుల్‌లపై నిషేధం విధిస్తే బోర్డు గురించి తప్పుడు సంకేతాలు వెలువడుతాయని కొందరు అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. 

మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. గతేడాది మార్చి1న పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె ఫేక్‌ డిగ్రీ సర్టిఫికేట్స్‌ వ్యవహారం వెలుగు చూడటంతో పంజాబ్‌ ప్రభుత్వం డీఎ‍‍స్పీ హోదాను తొలిగించింది.

మరిన్ని వార్తలు