‘ఒక్క పరుగు’కు రెండేళ్లు పూర్తి..వీడియో

23 Mar, 2018 12:13 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ఊహకందని స్థాయిలో.. ఊహించని రీతిలో.. చేజారిన మ్యాచ్‌ను టీమిండియా ఒడిసిపట్టుకున్న సందర్భం గుర్తుందా! నేటికి సరిగ్గా రెండేళ్ల కిందట.. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌ అయ్యాయి.

2016, మార్చి 23.. : టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లోకి వెళ్లాలంటే బంగ్లాపై గెలుపు తప్పనిసరి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. లక్ష్యఛేధనలో ధాటిగా ఆడిన బంగ్లా.. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సివచ్చింది. ఒకటో బంతి సింగిల్‌, రెండు, మూడో బంతులు బౌండరీలు.. అంటే మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లా గెలుస్తుంది. కానీ పాండ్యా వేసిన నాలుగో బంతికి ముష్ఫికర్‌ క్యాచౌట్‌! ఫుల్‌ టాస్‌గా వచ్చిన ఐదో బంతికి మమ్మదుల్లా క్యాచ్‌ఔట్‌. ఇక చివరి బంతి.. ఒక్క పరుగు తీసినా మ్యాచ్‌ టై అవుతుంది. మిస్టర్‌ కూల్‌ ధోనీ బంగ్లా కలలపై నీళ్లు జల్లాడు. ఆఫ్‌ స్టంప్‌ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్‌ షువగతా మిస్‌ చేశాడు. నాన్‌స్ట్రైకర్‌ ముస్తాఫిజుర్‌ పరుగు పూర్తిచేసేలోపే.. కీపర్‌ ధోనీ తెలివిగా పరుగెతుడూ వచ్చి బెయిల్స్‌ ఎగరగొట్టాడు. రనౌట్‌. భారత్‌ ఒక్కపరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది. టీ20ల్లో చివరి మూడు బంతులకు మూడు వికెట్లు నేలకూల్చిన భారత రికార్డు ఇంకా పదిలంగానేఉంది.

అఫ్‌కోర్స్‌ సెమీస్‌లో ఓడిపోయాం!: భారత్‌ వేదికగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ ఎగరేసుకుపోవడం తెలిసిందే. బంగ్లాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన భారత్‌.. సెమీస్‌లో మాత్రం కరీబియన్ల చేతిలో ఖంగుతిన్నది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో విండీస్‌ప్లేయర్లు రెచ్చిపోయి ఆడారు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిఉండగా బ్రాత్‌వైట్‌ సిక్స్‌బాదిన దృశ్యం క్రీడాభిమానుల మనసుల్లోనుంచి చెరిపేయలేనిది.

మరిన్ని వార్తలు