ముగ్గురూ క్వార్టర్స్‌లోనే...

21 Sep, 2013 01:12 IST|Sakshi
ముగ్గురూ క్వార్టర్స్‌లోనే...

టోక్యో: తొలిసారి ఓ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందినా... ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. శ్రీకాంత్, అజయ్ జయరామ్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత కథ ముగిసింది.
 
 శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ కె.శ్రీకాంత్ 18-21, 9-21తో ఏడో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ పోరాట పటిమను కనబర్చాడు.
 
  ఓ దశలో 13-18తో వెనుకబడ్డా నెట్ వద్ద మెరుగ్గా ఆడుతూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని 17-18కి తగ్గించాడు. అయితే బలమైన స్మాష్‌లతో చెలరేగిన టాగో వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మెరుగైన స్మాష్‌లతో ఆకట్టుకున్న ఈ ఏపీ కుర్రాడు నెట్ వద్ద విఫలమయ్యాడు. దీంతో గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 11-21, 22-20, 13-21తో హుయాన్ గో (చైనా) చేతిలో;అజయ్ జయరామ్ 18-21, 13-21తో ఐదోసీడ్ టియాన్ మిన్ గుయాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయారు.
 

మరిన్ని వార్తలు