ప్రణయ్‌ నిష్క్రమణ 

4 May, 2019 01:06 IST|Sakshi

ఆక్లాండ్‌: వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులెవరూ కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయారు. న్యూజిలాండ్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ నిష్క్రమణతో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–17, 15–21, 14–21తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ కాంటా సుయెయామ (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌ తొలి గేమ్‌ను గెల్చుకున్నా... ఆ తర్వాత తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 14–16 వద్ద ప్రణయ్‌ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 900 డాలర్ల (రూ. 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఏ విభాగంలోనూ భారత ఆటగాళ్లు క్వార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయారు.    

మరిన్ని వార్తలు