మూడో వన్డేపై 'పటేల్' మేఘాలు

18 Oct, 2015 09:25 IST|Sakshi
మూడో వన్డేపై 'పటేల్' మేఘాలు

- మ్యాచ్ వేదికగా నిరసనలకు హార్దిక్ అండ్ కో సన్నాహాలు
- రాజ్ కోట్ లో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం
- అసాధారణ భద్రత నడుమ నేడు భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే

రాజ్కోట్:
పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుల బెదిరింపుల నేపథ్యంలో ఆదివారం రాజ్ కోట్ లో జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే మ్చాచ్ కు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. ఇప్పటికే 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలియరావడంతో అటు పోలీసులు, ఇటు సౌరాష్ట్ర క్రికెటల్ అసోసియేషన్ ను గుబులు వెంటాడుతూనే ఉంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్ నిరాటంకంగా సాగుతుందని వారు భరోసా ఇస్తున్నారు. పటేల్ ఉద్యమకారులు కూడా ఇంతే గట్టిగా నిరసన తెలుపుతామని ప్రకటించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా రాజ్ కోట్ జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ పై పోలీసులు నిషేధం విధించారు. రాత్రి 10 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని ఖందేరీలోగల సౌరాష్ట్రా క్రికెట్ అసోసియేషన్ (ఎస్ సీఏ) స్టేడియానికి ప్రేక్షకులు వచ్చే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. కనీవినీ ఎరుగని రీతిలో నిఘా డ్రోన్ కెమెరాలు, నాలుగు వేల సాయుధబలగాలతో మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

తనతో సహా 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు ఇప్పటికే మ్యాచ్ టికెట్లను పొందామని హార్ధిక్ పటేల్ చెప్పారు. ఒకవేళ స్టేడియం లోపలికి తమను అనుమతించకుంటే.. మరో రూపంలో సత్తా చాటేందుకు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కార్యకర్తలు, పటేల్ కులస్తులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లలో ముఖ్యాంశాలు..

  • - ప్రత్యేకంగా రూపొందించిన మూడు డ్రోన్ కెమెరాలతో ప్రేక్షకుల కదలికలపై నిరంతర నిఘా
  • - స్టేడియం లోపల, వెలుపల 90కిపైగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు
  • - రెండు వేల మంది సాధారణ పోలీసులు
  • - మూడు కంపెనీల స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (ఎస్ ఆర్ పీఎఫ్) బలగాల మోహరింపు
  • - ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)
  • - మూడు బృందాల క్విక్ రెస్పాన్స్ సెల్ (క్యూఆర్ సీ)
  • - ఐదుగురు సూపరింటెండెంట్ ల పర్యవేక్షణ

స్టేడియంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది ఎవరైనా నిఘాను వదిలేసి మ్యాచ్ ను చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ కోట్ రేంజ్ ఐజీ డీఆర్ పటేల్ స్పష్టం చేశారు. ఎస్ సీఏ సెక్రటరీ నిరంజన్ షా మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లపై  క్రికెట్ మ్యాచ్ లో నిరసన తెలపడం సరైన చర్యకాదని, క్రీడలను క్రీడలుగానే చూడాలని అన్నారు. స్టేడియంలో నిరసనలు వద్దని తాను హార్దిక్ పటేల్ కు ఫోన్ చేసి విన్నవించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు