అలుపెరగని ‘పరుగు’

15 Feb, 2019 10:09 IST|Sakshi

ఆరు పదుల వయసులో రాణిస్తోన్న అన్నా అలెగ్జాండర్‌

టాటా ముంబై మారథాన్‌లో రజత పతకం

హైదరాబాద్‌: వృత్తి ఏదైనా ప్రవృత్తిలో రాణించవచ్చు. ఆటల్లో సత్తా చాటేందుకు వయసు అడ్డుకాబోదు. తల్లిదండ్రుల నుంచే కాదు కన్నబిడ్డల నుంచి కూడా స్ఫూర్తి పొందవచ్చు. ఈ అంశాలన్నీ నగరానికి చెందిన సీనియర్‌ ఉపాధ్యాయురాలు అన్నా అలెగ్జాండర్‌కు సరిగ్గా నప్పుతాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ... పరుగును ప్రవృత్తిగా మార్చుకుంది. ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన కన్నబిడ్డలు పరుగు పోటీల్లో పాల్గొనడం చూసి స్ఫూర్తి పొందిన ఈ అమ్మ ఏకంగా మలివయçసులో పతకాలను సాధిస్తోంది.  తాజాగా ముంబైలో జరిగిన టాటా–ముంబై మారథాన్‌ రేసులో అన్నా అలెగ్జాండర్‌ రజత పతకాన్ని గెలుచుకుంది. 60–64 వయోవిభాగం 10,000మీ. పరుగు ఈవెంట్‌ను ఆమె ఒక గంటా 19.45 నిమిషాల్లో పూర్తిచేసి రెండోస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన గిలియన్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతేడాది  ఇదే ఈవెంట్‌లో అన్నా స్వర్ణంతో సత్తా చాటింది.  

టీచర్‌ టు అథ్లెట్‌...

అమీర్‌పేట ధరమ్‌ కరమ్‌ రోడ్‌లోని సర్కారు బడిలో ‘పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటరీగా పనిచేస్తున్న అన్నా అలెగ్జాండర్‌ ఉచితంగా పాఠాలు బోధిస్తూ అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు. తన కుమారులు అశ్విన్, నితిన్‌ అలెగ్జాండర్‌ ఇంగ్లండ్‌లో జరిగే మారథాన్‌లలో క్రమం తప్పకుండా పాల్గొనడం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్న అన్నా... 2016 నుంచే రన్నింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నానని తెలిపింది. మూడేళ్లుగా వాకింగ్, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ వివిధ ప్రాంతాల్లో జరిగే మారథాన్‌లలో పాల్గొంటున్నానని చెప్పింది. 2017లో ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌లో 10,000 మీటర్ల పరుగులో బంగారు పతకం, 2018 నవంబర్‌లో ఫ్రీడం హైదరాబాద్‌ 10,000 మీటర్ల పరుగులో కాంస్యాన్ని గెలుచుకుంది. రన్నింగ్, సైక్లింగ్‌ ఈవెంట్‌లలో పాల్గొనే అన్నా అలెగ్జాండర్‌... హైదరాబాద్, హంపిలలో జరిగే ‘గో హెరిటేజ్‌’ ఈవెంట్‌లలోనూ భాగస్వాములవుతున్నారు. 20 ఏళ్ల క్రితం ముంబైలోని భారత్‌ పెట్రోలియంలో ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్‌ వచ్చిన ఆమె... బంజారాహిల్స్‌లో మంజరి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. 2011లో ఈ పాఠశాల మూతపడటంతో టీచర్‌ వృత్తిపట్ల తనకున్న ఇష్టంతో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. అమీర్‌పేట సర్కారు బడిలో ఇంగ్లిషు టీచర్‌గా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. భర్త అజిత్‌ అలెగ్జాండర్‌ జార్జ్, కొడుకులు, కోడళ్ల ప్రోత్సాహంతో పరుగులో కొనసాగుతున్నానని ఆమె తెలిపింది. 

మరిన్ని వార్తలు