ఓటమితో ముగించారు

4 Feb, 2017 10:28 IST|Sakshi

ఆంధ్ర చేతిలో హైదరాబాద్ పరాజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ  

 
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బౌలర్లు రాణిం చినా... బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో చివరి మ్యాచ్‌ను కోల్పోయి ఈ టోర్నీని హైదరాబాద్ జట్టు ఓటమితో ముగించింది. చెన్నైలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై 11 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు గెలుపొందింది. సౌత్‌జోన్ విభాగంలో జరిగిన పోటీల్లో మొత్తం 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ మొదటి 3 మ్యాచ్‌లు గెలిచి... చివరి 2 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (49; 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రికీ భుయ్ (21; 1 ఫోర్) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగగా... రవికిరణ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. తన్మయ్ అగర్వాల్ (49; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడగా... ఆకాశ్ భండారి (26; 1 ఫోర్, 1 సిక్సర్) రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో స్వరూప్ కుమార్ 5 వికెట్లతో విజృంభించగా...గిరినాథ్ రెడ్డి 3 వికెట్లు దక్కించుకున్నాడు.

 ఓపెనర్ల జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు భరత్ (16), హనుమ విహారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్‌కు 37 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం సిరాజ్ బౌలింగ్‌లో భరత్ పెవిలియన్ చేరాడు. విహారికి జతకలిసిన రికీ భుయ్ ఆచితూచి ఆడాడు. రికీ ఎక్కువగా సింగిల్స్‌కు ప్రాధాన్యమిస్తూ స్ట్రరుుక్ రొటేట్ చేయగా... విహారి దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే రవికిరణ్ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి విహారి వెనుదిరిగాడు. గిరినాథ్ రెడ్డి (15) ఒక సిక్సర్‌తో దూకుడు కనబరిచినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తర్వాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో రవితేజ (8), గణేశ్ (7), శ్రీనివాస్ (2), స్వరూప్ (6), భట్ (1), అయ్యప్ప (0), శశికాంత్ (9 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

 ఒకరి తర్వాత మరొకరు: స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు విఫలమైంది. తన్మయ్ ధాటిగా ఆడినా ... మిగతా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ అక్షత్ (7) వెనుదిరగగా... తన్మయ్, బద్రీనాథ్ (19) ఇన్నింగ్‌‌స నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత స్వరూప్ ధాటికి అనిరుధ్ (6), ఆకాశ్ (4), సుమంత్ (2) పెవిలియన్‌కు చేరారు. ఆంధ్ర బౌలర్లను ఓ ఎండ్‌లో ఆకాశ్ భండారి సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ... మరో ఎండ్‌లో హసన్ (5), మిలింద్ (5), సిరాజ్ (1) క్రీజులో నిలవలేకపోయారు. చివరి ఓవర్లో భండారి ఔటయ్యాడు.

 

మరిన్ని వార్తలు