ఫుట్‌బాల్‌ రాత మారుస్తాం

30 Sep, 2019 03:26 IST|Sakshi

హైదరాబాద్‌ ఎఫ్‌సీ యాజమాన్యం 

టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) సహ యజమాని విజయ్‌ మద్దూరి తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడినుంచి సాకర్‌ స్టార్లను తయారు చేస్తామని చెప్పారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో కొత్తగా ఈ ఏడాది హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ప్రవేశించింది. వచ్చే నెల 20న మొదలయ్యే ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి  ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్, భారత క్రికెట్‌  మాజీ కెపె్టన్, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జట్టు యజమాని విజయ్‌ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరంలో ఫుట్‌బాల్‌ను విస్తరిస్తామని అన్నారు.

నగరానికి ఫుట్‌బాల్‌లో చక్కని చరిత్ర ఉందని, తమ జట్టు దాన్ని మరింత బలబరిచేందుకు కృషి చేస్తుందని సహ యజమాని వరుణ్‌ త్రిపురనేని చెప్పారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘ఓ క్రీడాభిమానిగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఫ్రాంచైజీకి స్వాగతం పలుకుతున్నా. ఐఎస్‌ఎల్‌లో తలపడేందుకు ఇప్పుడు మనకంటూ ఓ జట్టు ఉందని సంతోషం కలుగుతోంది. హైదరాబాద్‌ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో ఎనిమిది మంది హైదరాబాదీలే. ఈ  క్లబ్‌తో మళ్లీ నగరానికి సాకర్‌ వైభవం రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. అజహర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ఎఫ్‌సీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొమ్మిదేళ్ల క్రితమే తాను ఫుట్‌బాల్‌ అభివృద్ధికి తపించానని... అయితే అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు