హైదరాబాద్‌ ‘కిక్‌’

25 Oct, 2019 02:50 IST|Sakshi

ఐఎస్‌ఎల్‌లో తొలిసారి హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 

నేటి మొదటి మ్యాచ్‌లో అట్లెటికో జట్టుతో ఢీ

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ పుటల్లో హైదరాబాద్‌ ఆటగాళ్లకు ప్రత్యేక స్థానముంటుంది. అలనాటి జాతీయ సాకర్‌ జట్టును నడిపించినా... గెలిపించినా... అది హైదరాబాదీ ఆటగాళ్ల ఘనతే! ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో మనవాళ్లే భారత జట్టును శాసించారు. తుది జట్టుకు ఆడినవారిలో ఏకంగా 8 నుంచి 10 మంది హైదరాబాద్‌ అటగాళ్లే ఉన్నారంటే మన ఫుట్‌బాలర్ల సత్తా ఏంటో ఇప్పటికే అర్థమైవుంటుంది.

భారత ఫుట్‌బాల్‌ జట్టుకు నాయకత్వం వహించిన విక్టర్‌ అమల్‌రాజ్‌ సహా ఎస్‌.ఎ.రహీమ్, నయీమ్, హకీమ్, జులిఫకర్, పీటర్‌ తంగరాజ్‌ తదితరులు భారత ఫుట్‌బాల్‌కు ఎనలేని సేవలందించారు. కాలక్రమంలో హైదరాబాదీల ప్రతిభ మరుగునపడింది. జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో మనోళ్లకు చోటే గగనమయ్యే పరిస్థితి తలెత్తింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ద్వారా హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ తెరముందుకొచ్చింది.

పుణే స్థానంలో లీగ్‌లోకి...
ఐఎస్‌ఎల్‌లో పుణే ఆరంభం నుంచి ఉంది. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో అనూహ్యంగా హైదరాబాద్‌కు చాన్స్‌ వచ్చింది ఈ సీజన్‌కైతే మొత్తంగా పుణే ఎంపిక చేసుకున్న ఆటగాళ్లతోనే ఆడుతున్నప్పటికీ వచ్చే సీజన్‌లో హైదరాబాదీలకు చోటిస్తామని ఫ్రాంచైజీ సహ యజమాని వరుణ్‌ త్రిపురనేని చెప్పారు. తమ జట్టుకు విశేష అనుభవమున్న కోచ్‌ ఫిల్‌ బ్రౌన్‌ (ఇంగ్లండ్‌) ఉన్నారని... తప్పకుండా ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రాణిస్తుందని ముఖ్యంగా హైదరాబాదీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు. విజయ్‌ మద్దురితో కలిసి ఆయన ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు.  హైదరాబాద్‌ ఎఫ్‌సీ తమ హోమ్‌ మ్యాచ్‌లను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆడుతుంది.

మరిన్ని వార్తలు