హైదరాబాద్‌ మళ్లీ విఫలం

1 Mar, 2019 10:07 IST|Sakshi

4 వికెట్లతో సర్వీసెస్‌ గెలుపు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ జాతీయ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో త్రిపుర జట్టుపై గెలుపొంది విజయాల బాట పట్టినట్లే కనిపించిన హైదరాబాద్‌... సర్వీసెస్‌ జట్టు చేతిలో విఫలమైంది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో సర్వీసెస్‌ జట్టు చేతిలో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కిది ఐదో పరాజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (31 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌), టి. రవితేజ (19 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్‌ కుమార్, రజత్‌ చెరో 2 వికెట్లు దక్కించుకోగా... సచిదానంద్‌ పాండే, వికాస్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం సర్వీసెస్‌ జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. వికాస్‌ హథ్‌వాలా (40 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. రజత్‌ (27; 2 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్, టి. రవితేజ చెరో వికెట్‌ తీశారు.  

శుభారంభం దక్కినా...

త్రిపురపై గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగిన ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (17; 3 ఫోర్లు), కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. తిలక్‌ వర్మ (10) ఎల్బీగా పెవిలియన్‌ చేరగా.. కొద్దిసేపటికే కె. రోహిత్‌ రాయుడు (1), అక్షత్‌రెడ్డి రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 66 పరుగులకే జట్టు 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బావనక సందీప్‌ (19; 1 సిక్స్‌) కాసేపు క్రీజులో నిలిచాడు. మరో ఎండ్‌లో సుమంత్‌ కొల్లా (8) విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవితేజ దూకుడు కనబరిచాడు. సందీప్‌ సహకారంతో స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. ఈ జంట ఆరో వికెట్‌కు 20 పరుగులు జోడించాక సందీప్‌ను ఔట్‌ చేసి రజత్‌ ఈ జోడీని విడదీశాడు. తర్వాత సాకేత్‌ (5), సీవీ మిలింద్‌ (6), మెహదీహసన్‌ (2 నాటౌట్‌) కాసేపు సందీప్‌కు అండగా నిలిచారు. అనంతరం హైదరాబాద్‌ బౌలర్లపై వికాస్‌ విరుచుకుపడటంతో సర్వీసెస్‌ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది.  

స్కోరు వివరాలు
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) రాహుల్‌ సింగ్‌ (బి) మోహిత్‌ కుమార్‌ 17; అక్షత్‌ రెడ్డి రనౌట్‌ 34; తిలక్‌ వర్మ ఎల్బీడబ్ల్యూ (బి) వికాస్‌ యాదవ్‌ 10; రోహిత్‌ రాయుడు రనౌట్‌ 1; సందీప్‌ (స్టంప్డ్‌) వర్మ (బి) రజత్‌ 19; సుమంత్‌ (స్టంప్డ్‌) వర్మ (బి) రజత్‌ 8; రవితేజ నాటౌట్‌ 31; సాయిరామ్‌ (సి) శర్మ (బి) మోహిత్‌ కుమార్‌ 5; మిలింద్‌ (సి) వర్మ (బి) సచిదానంద పాండే 6; మెహదీహసన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1–32, 2–50, 3–57, 4–66, 5–80, 6–100, 7–114, 8–125.

బౌలింగ్‌: దివేశ్‌ పథానియా 4–0–22–0, సచిదానంద పాండే 3–0–20–1, మోహిత్‌ కుమార్‌ 4–0–31–2, అర్జున్‌ శర్మ 3–0–18–0, వికాస్‌ యాదవ్‌ 4–0–35–1, రజత్‌ 2–0–9–2.  
సర్వీసెస్‌ ఇన్నింగ్స్‌: నకుల్‌ వర్మ (సి) మెహదీహసన్‌ (బి) మిలింద్‌ 14; రవి చౌహాన్‌ (సి) సిరాజ్‌ 11; మోహిత్‌ అహ్లావత్‌ (బి) సిరాజ్‌ 0; రజత్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రవితేజ 27; వికాస్‌ హాథ్‌వాల్‌ నాటౌట్‌ 61; జి. రాహుల్‌ సింగ్‌ (సి) సుమంత్‌ (బి) సిరాజ్‌ 19; అర్జున్‌ శర్మ (సి) తిలక్‌ వర్మ (బి) సిరాజ్‌ 0; దివేశ్‌ పథానియా నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 141.

వికెట్ల పతనం: 1–26, 2–26, 3–32, 4–71, 5–120, 6–120.
బౌలింగ్‌: మెహదీహసన్‌ 3.4–0–31–0, సిరాజ్‌ 4–0–20–4, మిలింద్‌ 4–0–28–1, రవితేజ 3–0–29–1, సాయిరామ్‌ 4–0–25–0, సందీప్‌ 1–0–7–0.

మరిన్ని వార్తలు