హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

2 Mar, 2017 10:51 IST|Sakshi
హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

ఛత్తీస్‌గఢ్‌పై 4 పరుగులతో గెలుపు
రాణించిన సందీప్‌
బౌలర్ల సమష్టి ప్రదర్శన
విజయ్‌ హజారే క్రికెట్‌ టోర్నీ  

కోల్‌కతా: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌ చెలరేగగా... ఈ మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. టాస్‌ గెలిచిన ఛత్తీస్‌గఢ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 47 ఓవర్లలో 197 పరుగులకే అలౌటైంది. బావనాక సందీప్‌ (99 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో హైదరాబాద్‌ సాధారణ స్కోరును సాధించింది.

ఓపెనర్లు తన్మయ్‌ (26; 5 ఫోర్లు), అక్షత్‌ రెడ్డి (24; 3 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 52 పరుగుల్ని జోడించిన తర్వాత తన్మయ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. మరి కొద్దిసేపటికే అక్షత్‌ బౌల్డవడంతో క్రీజులోకి వచ్చిన సుమంత్‌ (26; 3 ఫోర్లు), సందీప్‌ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ జంట కుదురుకుంటున్న సమయంలో సుమంత్‌ను ఖారే రనౌట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్‌ బద్రీనాథ్‌ (6), హిమాలయ్‌ అగర్వాల్‌ (0), మెహదీ హసన్‌ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరినా... సీవీ మిలింద్‌ (22), సందీప్‌కు చక్కని సహకారమందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 41 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఆకాశ్‌ భండారి (8), సిరాజ్‌ (3), ఎం. రవికిరణ్‌ (1) త్వరత్వరగా ఔటవ్వడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 197 పరుగుల వద్ద ముగి సింది. అనంతరం హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఛత్తీస్‌గఢ్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అశుతోష్‌ సింగ్‌ (65; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్, సీవీ మిలింద్, మెహదీ హసన్, సిరాజ్‌ తలా 2 వికెట్లు తీయగా... ఆకాశ్‌ భండారీ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్‌ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని జార్ఖండ్‌ జట్టుతో హైదరాబాద్‌ తలపడుతుంది.    

 

మరిన్ని వార్తలు