హైదరాబాద్‌లో డేనైట్‌ టెస్టు?

17 Mar, 2018 19:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీసీసీఐ, సీఓఏ పరిశీలన

విండీస్, ఆసీస్‌ సిరీస్‌లకు వేదికలు ఖరారు  

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తే. నెలల వ్యవధిలోనే ఇక్కడ టెస్టు, వన్డే జరగనుంది. పైగా ఆ టెస్టును డేనైట్‌గా నిర్వహించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌ లేదంటే రాజ్‌కోట్‌లో డేనైట్‌ మ్యాచ్‌ నిర్వహణకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఆమోదిస్తే భారత్‌లో తొలి డేనైట్‌ టెస్టుకు రంగం సిద్ధమవుతుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వదేశంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు వేదికలు ఖరారు చేసింది.

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో అక్టోబర్‌లో ఒక టెస్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. టెస్టులతో పాటు కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. బీసీసీఐ ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో కేవలం మూడు టెస్టులే జరుగనున్నాయి. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ జూన్‌లో జరుగుతుంది. అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు హైదరాబాద్, రాజ్‌కోట్‌ల్లో  జరుగుతాయి. తర్వాత నవంబర్‌లో ఐదు వన్డేల సిరీస్‌ను ముంబై, గువాహటి, కొచ్చి, ఇండోర్, పుణే వేదికల్లో నిర్వహిస్తారు.

మూడు టి20లు కోల్‌కతా, చెన్నై, కాన్పూర్‌లలో జరుగుతాయి. కోల్‌కతా మ్యాచ్‌ నవంబర్‌ 4న జరుగుతుంది. శనివారం జరిగిన బీసీసీఐ పర్యటనల ఖరారు కమిటీ సమావేశానికి బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. దుబాయ్‌లో ఉన్న సీఈఓ రాహుల్‌ జోహ్రి, వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది భారత్‌ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా ఇక్కడ ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడుతుంది. మొహాలీ (ఫిబ్రవరి 24), హైదరాబాద్‌ (ఫిబ్రవరి 27), నాగ్‌పూర్‌ (మార్చి 2), ఢిల్లీ (మార్చి 5), రాంచీ (మార్చి 8)లో వన్డేలు, బెంగళూరు (మార్చి 10), విశాఖపట్నం (మార్చి 13) వేదికల్లో రెండు టి20లు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు