తొలి విజయం కోసం

20 Nov, 2018 10:15 IST|Sakshi

 నేటి నుంచి ఢిల్లీతో హైదరాబాద్‌ పోరు

 రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం హైదరాబాద్‌ జట్టు ఉవ్విళ్లూరుతోంది. సొంత గడ్డపై గెలుపు రుచి చూసేందుకు సన్నద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్‌ తలపడనుంది. మరోవైపు ఢిల్లీ కూడా గెలవాలనే కసితో బరిలో దిగనుంది. హిమాచల్‌ ప్రదేశ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన ఢిల్లీ మరోసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా విజయం పైనే ఆశలు పెట్టుకుంది.

బౌలింగ్‌ బలహీనం

కేరళ, తమిళనాడుతో జరిగిన రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్‌కు చిక్కంతా బౌలింగ్‌తోనే. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మన బౌలర్లు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేకపోయారు. స్పిన్నర్‌ మెహిదీ హసన్, పేసర్‌ రవికిరణ్‌ మరింతగా రాణించాల్సి ఉంది. బ్యాటింగ్‌లో అక్షత్‌ రెడ్డి, బావనక సందీప్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో అక్షత్‌ డబుల్‌ సెంచరీతో, సందీప్‌ శతకంతో చెలరేగారు. హిమాలయ్‌ అగర్వాల్, కె. రోహిత్‌ రాయుడు, సుమంత్‌ కొల్లా రాణిస్తున్నారు. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌ ఝళిపించాల్సి ఉంది.  

గంభీర్, ఇషాంత్‌ ఔట్‌

అనుభవజ్ఞుడైన గౌతమ్‌ గంభీర్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఢిల్లీ బలహీనపడింది. తొలి మ్యాచ్‌లో (44) రాణించిన గంభీర్‌ భుజం గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. అయితే బౌలింగ్‌ విభాగంలోనూ ఢిల్లీకి పెద్ద దెబ్బ పడింది. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కూడా బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో గౌరవ్‌ లేదా సిమ్రన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు వరుణ్, వికాస్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మరోవైపు గంభీర్‌ గైర్హాజరీతో హితేన్‌తో కలిసి సార్థక్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. గంభీర్‌ గైర్హాజరీని జూనియర్‌ ఆటగాళ్లు ఉపయోగించుకొని రాణించాలని కోచ్‌ మిథున్‌ మనాస్‌ ఆకాంక్షించారు. గత మ్యాచ్‌లో విఫలమైన యువ కెప్టెన్‌ నితీశ్‌ రాణా ఈ మ్యాచ్‌లో రాణించాలని జట్టు కోరుకుంటోంది. 

>
మరిన్ని వార్తలు