హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా

12 Oct, 2017 10:08 IST|Sakshi

సీకే నాయుడు క్రికెట్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ చివరి రోజు మధ్యప్రదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాడటంతో హైదరాబాద్‌కు ‘డ్రా’ తప్పలేదు. బుధవారం 213/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 90.3 ఓవర్లలో 4 వికెట్లకు 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జీవీ వినీత్‌ రెడ్డి (83; 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ బుద్ధి రాహుల్‌ (81; 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 376 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్‌కు నిర్దేశించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ ఆటముగిసే సమయానికి 68.1 ఓవర్లలో 5 వికెట్లకు 274 పరుగులతో నిలిచింది. సల్మాన్‌ ఖాన్‌ (102 నాటౌట్‌; 9 ఫోర్లు) అజేయ శతకంతో రాణించడంతో పాటు, చందన్‌ సింగ్‌ గిల్‌ (74; 10 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ 2, కె. నితీశ్‌ రెడ్డి, మీర్‌ ఒమర్‌ ఖాన్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు సాధించగా, మధ్యప్రదేశ్‌ 227 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3 పాయింట్లు, మధ్యప్రదేశ్‌కు ఒక పాయింట్‌ లభించాయి. ఆదివారం నుంచి జరిగే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, జార్ఖండ్‌తో తలపడుతుంది.  

మరిన్ని వార్తలు