హైదరాబాద్‌ ఓపెన్‌ రద్దు 

5 Jun, 2020 00:04 IST|Sakshi

కరోనా తగ్గే అవకాశం లేకపోవడంతో నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టోర్నీల రీషెడ్యూల్‌లో భాగంగా జరగాల్సిన తొలి టోర్నీ ‘హైదరాబాద్‌ ఓపెన్‌’ రద్దయింది. టూర్‌లో సూపర్‌–100 హోదా గల ఈ టోర్నీ ఆగస్టు 11నుంచి 16నుంచి నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. అయితే  కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నందున ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ గురువారం ప్రకటించింది. తమ నిర్ణయాన్ని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కూడా అంగీకరించిందని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. ప్రపంచమంతటా పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న నేపథ్యంలో రీషెడ్యూల్‌ చేసిన మిగతా టోర్నీల వివరాలను సందర్భానుసారం ప్రకటిస్తామని సమాఖ్య కార్యదర్శి థామస్‌ లాండ్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ స్పందించారు. లాక్‌డౌన్‌ ఇంకా అమల్లో ఉన్న తెలంగాణలో ఆగస్టులో హైదరాబాద్‌ ఓపెన్‌ నిర్వహించడం నిజంగానే కష్టమయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు.  
ప్రాక్టీస్‌లో అశ్విని, లక్ష్యసేన్‌ 
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ అశ్విని పొన్నప్ప, యువ ఆటగాడు లక్ష్యసేన్‌ రెండు నెలల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టారు. బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకోన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) వేదికగా కోచ్‌ విమల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వీరిద్దరూ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 20 మంది షట్లర్లు ప్రాక్టీస్‌కు హాజరవుతున్నట్లు విమల్‌ కుమార్‌ తెలిపారు. అకాడమీలో థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజేషన్‌ సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన... పరిశుభ్రత విషయంలో ఆటగాళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరినట్లు పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు