‘స్వర్ణ’ సాత్విక

10 Dec, 2019 01:40 IST|Sakshi

మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో పసిడి నెగ్గిన హైదరాబాద్‌ ప్లేయర్‌

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల వర్షం

కఠ్మాండు (నేపాల్‌): తమ పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ ‘ట్రిపుల్‌ సెంచరీ’కి చేరువైంది. పోటీల తొమ్మిదో రోజు సోమవారం భారత్‌ ఏకంగా 42 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 27 స్వర్ణాలు, 12 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ 159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలతో కలిపి మొత్తం 294 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 195 పతకాలతో (49 స్వర్ణాలు+54 రజతాలు+92 కాంస్యాలు) నేపాల్‌ రెండో స్థానంలో ఉంది. నేడు క్రీడలకు చివరి రోజు కావడం... ఇంకొన్ని ఈవెంట్స్‌లో భారత్‌ బరిలో ఉండటంతో మన పతకాల సంఖ్య 300 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 309 పతకాలు సాధించింది.

సోమవారం టెన్నిస్‌ సింగిల్స్‌ ఈవెంట్స్‌లో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు సామ సాత్విక, బవిశెట్టి సౌజన్య మధ్య ఫైనల్‌ జరిగింది. సాత్విక 4–6, 6–2, 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో మోచేతి గాయం కారణంగా సౌజన్య వైదొలిగింది. దాంతో సాత్వికకు స్వర్ణం ఖాయమైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పసిడి నెగ్గిన సౌజన్య రజతంతో సంతృప్తి పడింది. పురుషుల సింగిల్స్‌లో మనీష్‌ సురేశ్‌ కుమార్‌ (భారత్‌) 6–4, 7–6 (8/6)తో భారత్‌కే చెందిన డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు, విశాఖపట్నం ప్లేయర్‌ సాకేత్‌ మైనేనిపై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు.

బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఒక రజతం లభించింది. అంకిత్‌ ఖటానా (75 కేజీలు), వినోద్‌ తన్వర్‌ (49 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (56 కేజీలు), గౌరవ్‌ చౌహాన్‌ (91 కేజీలు), కలైవాని శ్రీనివాసన్‌ (మహిళల 48 కేజీలు), పర్వీన్‌ (మహిళల 60 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మనీశ్‌ కౌశిక్‌ (పురుషుల 64 కేజీలు) రజతం గెలిచాడు. మంగళవారం రెజ్లింగ్‌లో గౌరవ్‌ బలియాన్‌ (పురుషుల 74 కేజీలు), అనితా షెరోన్‌ (మహిళల 68 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు.

కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లకే స్వర్ణాలు లభించాయి. పురుషుల ఫైనల్లో భారత్‌ 51–18తో శ్రీలంకపై, మహిళల జట్టు 50–13తో నేపాల్‌పై గెలిచాయి. భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఫైనల్లో 2–0తో నేపాల్‌పై నెగ్గి వరుసగా మూడోసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది.

మరిన్ని వార్తలు