నాన్నకు ప్రేమతో...

16 Aug, 2017 23:33 IST|Sakshi
నాన్నకు ప్రేమతో...

ప్రతికూల పరిస్థితుల్లోనూ తప్పని గురి
ఆసియా షూటింగ్‌లో పతకాలు నెగ్గిన హైదరాబాదీ షూటర్‌
రష్మీ రాథోడ్‌ విజయగాథ


హైదరాబాద్‌ : ఏడేళ్లుగా షూటింగ్‌లో నిలకడగా రాణింపు... జాతీయ స్థాయిలో 14 పతకాలు... అయితే ఆశించిన ‘పెద్ద’ విజయం మాత్రం ఇంకా దక్కలేదు. ఏడాది క్రితం త్రుటిలో కోల్పోయిన ఆ పతకాన్ని ఈ సారి దక్కించుకోవాలని ఆమె పట్టుదలగా శ్రమించింది. అన్ని విధాలుగా పోటీలకు సిద్ధమైంది. ఇంతలో పెద్ద కుదుపు... తన చేతికి తుపాకీ అందించి మార్గదర్శిగా నిలిచిన తండ్రి హఠాన్మరణం! మరో పక్షం రోజుల్లో ఆసియా చాంపియన్‌షిప్‌ పోటీలకు వెళ్లాల్సి ఉంది. కానీ తన ఆటపై సందేహాలు. అయితే చివరకు ఆమె బాధను దిగమింగి ఆడేందుకే సిద్ధమైంది. కజకిస్తాన్‌లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన రష్మీ రాథోడ్‌ సత్తా చాటింది. స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించిన రష్మీ... మహిళల టీమ్‌ ఈవెంట్‌లో రజతం కూడా గెలుచుకుంది. అయితే ఈ విజయానందాన్ని చూసేందుకు తండ్రి మాత్రం లేరు. ‘పోటీ ముగిసిన తర్వాత ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. నాకు అన్ని విధాలా నాన్నే స్ఫూర్తిగా నిలిచారు. ఈ విజయం ఆయనకు అంకితం. ఆయన ఉండి ఉంటే చాలా సంతోషించేవారు’ అని రష్మీ ఉద్వేగంగా చెప్పింది.  

తుపాకులు, కత్తులు...
రష్మీ తండ్రి వైఎస్‌ రాథోడ్‌ ఆర్మీలో కెప్టెన్‌గా పని చేశారు. దాంతో సహజంగానే తుపాకులపై ఆసక్తి పెరిగింది. అయితే అది ఎంతగా అంటే ఆమె ఆట వస్తువుల్లో గన్స్, డాగర్స్‌ తప్ప మరొకటి లేదు. అమ్మాయిలు ఇష్టపడే బార్బీలాంటి బొమ్మలతో అసలు తానెప్పుడూ ఆడుకోనే లేదు. అయితే ప్రొఫెషనల్‌గా షూటింగ్‌లో వెళ్లాలని రష్మీ కూడా అనుకోలేదు. 2005లో చదువు పూర్తి చేసిన తర్వాతనే ఆమె ఆసక్తి దీని వైపు మళ్లింది. ఆ సమయంలో గచ్చిబౌలి రేంజ్‌లో జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ చూసేందుకు నాన్నతో పాటు వెళ్లింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. వచ్చే ఏడాది నువ్వు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలంటూ ప్రోత్సహించిన తండ్రి, అందు కోసం తగిన రీతిలో అక్కడే శిక్షణ ఇప్పించారు. అయితే షాట్‌గన్‌ ప్రాక్టీస్‌లో ‘రీ కాయిల్‌’ (బుల్లెట్‌ ఫైర్‌ చేశాక వచ్చే కుదుపు) చాలా ఎక్కువగా ఉండటంతో ఆరంభంలో గాయాలపాలైంది. కానీ పట్టుదలతో ఫిట్‌నెస్‌ను పెంచుకొని తీవ్రంగా సాధన చేసింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు నిలకడగా రాణించిన రష్మీ, 2008లో భారత షూటింగ్‌ జట్టులో భాగంగా మారింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు గెలుచుకుంది.  

గురి కుదిరింది...
రెండేళ్ల క్రితం భారత కోచ్‌గా ఎనియో ఫాల్కో వచ్చిన తర్వాత రష్మీ షూటింగ్‌ మరింత మెరుగైంది. భారత క్యాంప్‌లో తన లోపాలు సరిదిద్దుకుంటూ మంచి ఫలితాలు సాధించింది. గత ఏడాది కువైట్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 67/75 స్కోర్‌ చేసిన ఆమె పతకం సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత షూటర్లకు అవసరమైన మానసిక బలం కోసం స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ వైభవ్‌ అగషే సహాయం తీసుకోవడం రష్మీని దృఢంగా మార్చింది. సంవత్సరం తర్వాత తగిన ఫలితాన్నిచ్చింది. కజకిస్తాన్‌ ఈవెంట్‌లో సింగిల్స్‌ విభాగంలో కూడా రష్మీ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. రష్మీ తల్లి ఆనీ మ్యాథ్యూ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో భారత రాయబార కార్యాలయంలో ప్రొటోకాల్‌ అధికారిణిగా పని చేస్తోంది. స్కూల్‌ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోనే చదివిన రష్మీ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో అకౌంటింగ్స్‌ అండ్‌ కంట్రోల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. 34 ఏళ్ల రష్మి ప్రస్తుతం చదువు, ఉద్యోగంలాంటివి పక్కన పెట్టి పూర్తిగా షూటింగ్‌పైనే దృష్టి పెట్టి పెద్ద  లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఉంది.  

కజకిస్తాన్‌లో సాధించిన పతకాలు నా కెరీర్‌లో మేలిమలుపు. 17 డిగ్రీల చలి వాతావరణంలో, గాలి దిశ మార్చుకుంటున్న ప్రతికూల వాతావరణంలో విజయం సాధించడం నా ఆటపై పెరిగిన పట్టుకు నిదర్శనం. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. త్వరలో మాస్కోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్నా. అక్కడ పోటీ చాలా ఉంటుంది. ఈ టోర్నీలో విజయం సాధించగలిగితే చాలా గొప్ప ఘనత అవుతుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే నా లక్ష్యానికి  అది చేరువ చేస్తుందని నా నమ్మకం. కేవలం షూటింగ్‌ అంటే పిచ్చి వల్లే నేను ఆటలో కొనసాగుతున్నాను. విజయాలకు అడ్డు కావద్దని పెళ్లి తదితర వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టాను. షూటింగ్‌లో వయసు పెద్ద అడ్డంకి కాదు కాబట్టి నేను దానిని పట్టించుకోను.                
– రష్మీ రాథోడ్, షూటర్‌ 

మరిన్ని వార్తలు