ఒక పరుగు ఆధిక‍్యంలో..

1 Dec, 2018 09:56 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో  352 ఆలౌట్‌

సందీప్, రవితేజ అర్ధ సెంచరీలు

‘డ్రా’ దిశగా హిమాచల్‌తో మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి విజయం కోసం ఉవ్విళ్లూరుతోన్న హైదరాబాద్‌ జట్టుకు నిరీక్షణ తప్పేలా లేదు. రాజీవ్‌ గాంధీ స్టేడియంలో హిమాచల్‌ప్రదేశ్, హైదరాబాద్‌ జట్ల మధ్య జరుగుతోన్న ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ ‘డ్రా’ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 146/1తో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ ఆటముగిసే సమయానికి 130.5 ఓవర్లలో 352 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్‌కు కేవలం ఒకే ఒక పరుగు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అక్షత్‌ రెడ్డి (192 బంతుల్లో 99; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోగా... బావనక సందీప్‌ (107 బంతుల్లో 50;3 ఫోర్లు), టి. రవితేజ (116 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టు స్వల్ప ఆధిక్యాన్ని సాధించగలిగింది. ప్రత్యర్థి బౌలర్లలో మయాంక్‌ డాగర్, అర్పిత్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులు చేసింది. నేడు మ్యాచ్‌కు చివరి రోజు.  

రాణించిన సందీప్, రవితేజ

శుక్రవారం ఆటలో బౌలర్‌ అర్పిత్‌ ధాటికి ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ కె. రోహిత్‌ రాయుడు (25), అక్షత్‌ రెడ్డి ఒక పరుగు వ్యవధిలో తమ వికెట్లను కోల్పోయారు. ఈ దశలో వచ్చిన సందీప్‌ స్కోరు పెంచే బాధ్యతను తీసుకున్నాడు. కానీ మరో ఎండ్‌లో హిమాలయ్‌ అగర్వాల్‌ (6), సుమంత్‌ కొల్లా (9) విఫలమయ్యారు. దీంతో 222 పరుగులకే హైదరాబాద్‌ 5 వికెట్లను కోల్పోయింది. మరికొద్దిసేపటికే క్రీజులో కుదురుకున్న సందీప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన రవితేజ లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. తనయ్‌ త్యాగరాజన్‌ (14)తో ఏడో వికెట్‌కు 30 పరుగులు, రవికిరణ్‌ (4)తో తొమ్మిదో వికెట్‌కు 49 పరుగులు జోడించి వెనుదిరిగాడు. చివరి వికెట్‌గా రవికిరణ్‌ ఔట్‌ కాగానే మూడో రోజు ఆట ముగిసింది. 

మరిన్ని వార్తలు