స్నేహిత్‌కు మూడో స్థానం

15 Mar, 2020 09:08 IST|Sakshi

ఒమన్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒమన్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రీడాకారుడు సూరావజ్జుల స్నేహిత్‌ రాణించాడు. మస్కట్‌లో జరిగిన ఈ టోర్నీలో స్నేహిత్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన అండర్‌–21 పురుషుల సెమీఫైనల్లో స్నేహిత్‌ పోరాడి ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో స్నేహిత్‌ 11–7, 5–11, 8–11, 11–8, 12–14తో ప్రపంచ నంబర్‌వన్‌ మానవ్‌ ఠక్కర్‌ (భారత్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

అంతకుముందు క్వార్టర్స్‌ మ్యాచ్‌లో స్నేహిత్‌ 11–6, 11–2, 13–11తో హజిన్‌ జెరెమీ (కెనడా)పై గెలుపొందాడు. సెమీస్‌లో ఓటమి పట్ల స్నేహిత్‌ నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఈ గేమ్‌ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యా. నా కోచ్‌ సోమనాథ్‌ ఘోష్‌తో కూడా చర్చించా. కానీ అద్భుత ఫామ్‌లో ఉన్న మానవ్‌పై పైచేయి సాధించలేకపోయా. ఫైనల్‌ చేరే గొప్ప అవకాశం చేజార్చుకున్నా. కాస్త నిరాశగా ఉంది’ అని స్నేహిత్‌ అన్నాడు. పురుషుల విభాగంలో మెయిన్‌డ్రాకు అర్హత పొందిన స్నేహిత్‌ తొలి రౌండ్‌లోనే 2–4తో చెయ్‌ హి యు క్లారెన్స్‌ (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు.   

మరిన్ని వార్తలు