నువ్వు చెప్పింది నిజం కోహ్లి .. నీకే నా ఓటు: గంభీర్‌

28 Nov, 2019 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు విదేశాల్లో విజయాలు సాధించడమనేది గంగూలీ సారథ్యంలోనే బీజం పడిందని కోహ్లి కొనియాడాడు. దానికి కొనసాగింపే తమ ప్రస్తుత విజయ పరంపర అని కోహ్లి పేర్కొన్నాడు. అయితే దీన్ని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ వ్యతిరేకించాడు. అసలు భారత్‌ జట్టు విదేశీ విజయాలు సాధించింది ఎప్పుడో 70-80 దశకాల్లోనేని తెలిపాడు.

గంగూలీని పొగడాలనే ఉద్దేశంతోనే కోహ్లి ఇలా చేశాడన్నాడు. తాము విజయాలు సాధించే సరికి కోహ్లి ఇంకా పుట్టలేదంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. కాగా, ఈ వ్యవహారంపై కోహ్లికి మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అండగా నిలిచాడు. కోహ్లి చెప్పింది అక్షర సత్యమన్నాడు. ‘ కోహ్లి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నీకే నా ఓటు. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశీ విజయాల్ని ఎక్కువగా నమోదు చేసింది. విదేశీ విజయాలకు బీజం పడింది గంగూలీ కెప్టెన్సీలోనే. అది కోహ్లి వ్యక్తిగత ఆలోచనే కావొచ్చు. కానీ అందులో ఎటువంటి అవాస్తవం లేదు. భారత్‌ జట్టు విదేశీ గడ్డపై గెలుపుల్ని అలవాటు చేసుకుంది గంగూలీ నేతృత్వంలో అనేది నిజం.  ఇక గావస్కర్‌, కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు స్వదేశీ విజయాలు నమోదు చేసింది. కాకపోతే విదేశాల్లో గంగూలీ కెప్టెన్సీలోనే భారత్‌ విజయాలు బాట పట్టింది. ఈ విషయంలో నేను కోహ్లితో అంగీకరిస్తా’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు