‘ధోని మాటకు చిర్రెత్తుకొచ్చింది’

5 Jun, 2020 15:27 IST|Sakshi

కిర్‌స్టన్‌ ఒక మాట.. ధోని మరొక మాట

అది అవమానం కాదా?: ఇర్ఫాన్‌

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వరుస కామెంట్లతో బిజీగా ఉంటున్నాడు. ఒకవైపు తన గత మధుర జ్ఞాపకాలను పంచుకుంటూనే చేదు నిజాల్ని కూడా బహిర్గతం చేస్తున్నాడు. తాజాగా స్పోర్ట్స్‌ తక్‌ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్‌ మరిన్ని విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు. ఇందులో అప్పటి టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని కూడా ఇర్ఫాన్‌ విమర్శించాడు. తనను జట్టులో నుంచి కనీసం కారణం చెప్పకుండా తీసేయడమే కాకుండా, నామ మాత్రపు మ్యాచ్‌లో కూడా అవకాశం కూడా ధోని ఇవ్వలేదన్నాడు. ఇది 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో జరిగిందన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ వరుసగా మూడు వన్డేలు సాధించి సిరీస్‌ను గెలుచుకోగా, నాల్గో వన్డే వర్షార్పణం అయ్యిందనే విషయాన్ని ఇర్ఫాన్‌ గుర్తు చేశాడు. (‘అందులో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ భేష్‌’)

ఈ క్రమంలోనే తనకు ఐదో వన్డేలో అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అది దక్కలేదన్నాడు. అయితే ఆ వన్డేకు తుది జట్టును ఎంపిక చేసే క్రమంలో ధోని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇర్ఫాన్‌ బౌలింగ్‌ సరిగా లేకపోవడం వల్లే అవకాశం ఇవ్వలేదని చెప్పిన విషయం తనకు తీవ్ర కోపం తెప్పించిందన్నాడు. అంతకుముందు దీనిపై అప్పటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌తో మాట్లాడినట్లు తెలిపాడు. తనను నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వలని అడిగినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. ‘ నీ బౌలింగ్, బ్యాటింగ్‌ బాగుంటాయి.. కానీ అవకాశం ఇచ్చే అంశం నా చేతుల్లో లేదు’ అని కిర్‌స్టన్‌ తెలిపాడన్నాడు. కిర్‌స్టన్‌ చెప్పిన దానికి భిన్నంగా ధోని చెప్పడంతో ఈ విషయంపై అమీతుమీకి సిద్ధమైనట్లు తెలిపాడు. నేరుగా ధోని వద్దకే వెళ్లి క్లారిటీ అడిగినట్లు తెలిపాడు. ‘‘మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. నా ప్రదర్శన బాగాలేని కారణంగా జట్టులో అవకాశం ఇవ్వలేదని చెప్పడం మీడియాలో రాద్దాంతం అవుతుంది’’ అని అడిగేశా. దానికి ధోని బదులిస్తూ.. ప్రణాళికలో భాగంగానే నిన్ను తుది జట్టుకు దూరం పెట్టామని సింపుల్‌గా బదులిచ్చాడన్నాడు. అయితే కిర్‌స్టన్‌ ఒకమాట, ధోని మరొక మాట చెప్పడం అవమానంగా ఫీలయ్యానన్నాడు.

ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో రూల్‌..
భారత క్రికెట్‌ జట్టులో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్‌ అనేది ఎప్పట్నుంచో వస్తున్న ఆచారమని ఇర్ఫాన్‌ అన్నాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేసినా అవకాశం ఇవ్వకపోతే తాను ఏమి చేయగలనని ఇర్ఫాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని సందర్భాల్లో స్వింగ్‌ బౌలింగ్‌ చేయమని, మరికొన్ని సందర్భాల్లో కట్టర్స్‌పైనే దృష్టి పెట్టమని పదే పదే కెప్టెన్లు చెబుతూ ఉండటంతో తాను బౌలింగ్‌ను మార్చుకోవాల్సి వస్తూ ఉండేదన్నాడు. అంతేకానీ స్వింగ్ బౌలర్‌నైనా తాను స్వింగ్‌ బౌలింగ్‌ వేయలేకపోవడంతోనే జట్టుకు దూరమైన అపోహలు కరెక్ట్‌ కాదన్నాడు. ‘ నాకు జట్టులో ఉద్వాసన పలికిన ఒకానొక సందర్భంలో రెండు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నా. ఒకటి వన్డేల్లో కాగా, రెండోది టీ20 మ్యాచ్‌. భారత్‌ క్రికెట్‌లో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్‌,. వృద్ధిమాన్‌ సాహా ఏడాది పాటు క్రికెట్‌ ఆడకుండానే రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి రిషభ్‌ పంత్ రెండు సెంచరీలు చేసి ఉన్నాడు. అయినా సాహాకు అవకాశం ఇచ్చారు. కొంతమందికి సపోర్ట్‌ ఉంటే, మరికొంతమందికి అది ఉండదు. కొందరిది అదృష్టం.. మరి కొందరిది దురుదృష్టం. నేను దురదృష్టవంతుల్లో ఒకడ్ని’ అని ఇర్ఫాన్‌ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. (అదే రూల్ ఫాలో అవుదామా?)

>
మరిన్ని వార్తలు