ప్రేక్షకుల్లేకుండా టోర్నీలు ఆడలేను

27 May, 2020 00:02 IST|Sakshi

వింబుల్డన్‌ మాజీ చాంపియన్‌ క్విటోవా

ప్రాగ్‌: ఖాళీ స్టేడియాల్లో ఆటకు తాను వ్యతిరేకమని చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ పెట్రా క్విటోవా చెప్పింది. కరోనా మహమ్మారి విలయంతో ఇప్పుడంతా గేట్లు మూసే ఆటలపైనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెక్‌ రిపబ్లిక్‌లో మళ్లీ టెన్నిస్‌ పునరుద్ధరణ సందర్భంగా రెండుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌ అయిన క్విటోవా మాట్లాడుతూ ‘నాకు మరో గ్రాండ్‌స్లామ్‌ ఆడాలనే ఉంటుంది. కానీ ప్రేక్షకుల్లేకుండా ఆడే పరిస్థితి వస్తే... ఆటను రద్దు చేసుకోవడమే మేలని భావిస్తాను. అభిమానులే మా చోదకశక్తి. ఆ శక్తిలేని చోటును చూడాలనుకోను. అది అసలు గ్రాండ్‌స్లామ్‌ అనిపించుకోదు’ అని తెలిపింది. తాను మళ్లీ టెన్నిస్‌ క్రీడను ఒక్క చెక్‌ రిపబ్లిక్‌లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. వైరస్‌ విస్తరిస్తుండటంతో ఈ సీజన్‌లో వింబుల్డన్‌ను రద్దు చేయగా... ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. 

>
మరిన్ని వార్తలు