భారత్లో చాలా కఠినం: క్లార్క్

6 Jan, 2017 14:09 IST|Sakshi
భారత్లో చాలా కఠినం: క్లార్క్

సిడ్నీ: భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని కచ్చితంగా అత్యుత్తమ నాయకుడని కితాబిచ్చాడు. అతని నాయకత్వ లక్షణాలతో భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడంటూ కొనియాడాడు. మ్యాచ్లో విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆడే ధోని స్వభావం తనకు ఎంతో ఇష్టమన్నాడు.

 

అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో ధోని ఒక చరిత్ర సృష్టించాడని క్లార్క్ పేర్కొన్నాడు. ఒక దేశానికి క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండాలంటే అది చాలా కష్టమన్నాడు. అందులోనూ క్రికెట్ ను ఒక మతంలా భావించే భారత్లో ఒత్తిడితో కూడుకున్నదని క్లార్క్ విశ్లేషించాడు. భారత్లో క్రికెట్ గేమ్ పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో తాను ఊహించగలనని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్క్ పేర్కొన్నాడు.

 

ఒక కెప్టెన్ ఎంత వరకూ చేయాలో అంతకంటే ఎక్కువే ధోని చేశాడన్న క్లార్క్.. అతను ఎప్పుడూ సరైన మార్గంలోనే క్రికెట్ ను ఆడుతూ జట్టుకు చిరస్మరణీయమైన సేవలందించాడని ర్కొన్నాడు. అయితే రాబోవు రోజుల్లో భారత విజయాల్లో ధోని పాత్ర ఉంటేనే అతను 2019 వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగుతాడని, కాని పక్షంలో అతని క్రికెట్ కెరీర్ను పెంచుకునే అవకాశం ఉండదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలామంది యువకులు ఉన్నారని ఈ సందర్భంగా క్లార్క్ గుర్తు చేశాడు. కచ్చితంగా విరాట్ కోహ్లికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందని భావించే ధోని ఆ నిర్ణయం తీసుకున్నాడని క్లార్క్ అన్నాడు.

మరిన్ని వార్తలు