ఇక హాయిగా విశ్రమిస్తా: కోహ్లి

28 Jan, 2019 18:07 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్న విశ్వాసాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌ గెలవడంతో సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటానని చెప్పాడు. కివీస్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... ‘చివరి రెండు వన్డేల్లోనూ మేము విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్‌ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంద’ని అన్నాడు. సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలకు కోహ్లి అందుబాటులో ఉండడం లేదు.

న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ గెలవడం పట్ల విరాట్‌ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నామన్నాడు. మూడో వన్డే చివర్లలో అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌ బాగా బ్యాటింగ్‌ చేశారని ప్రశంసించాడు. డ్రెసింగ్‌ రూములో కూర్చుని ప్రతి పరుగుకు కేరింతలు కొట్టామన్నాడు. ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభపై నమ్మకం ఉంచి, దాన్ని మైదానంలో ప్రదర్శించడంతో విజయాలు దక్కాయని విశ్లేషించాడు. కాగా, చివరి రెండు వన్డేలకు కోహ్లి స్థానంలో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు.

మరిన్ని వార్తలు