రికార్డు గురించి ఆలోచించలేదు

15 Nov, 2014 00:10 IST|Sakshi
రికార్డు గురించి ఆలోచించలేదు

కోల్‌కతా: గాయం తర్వాత రెండు నెలలకే తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది గానీ... పునరాగమనంలో రాణించడం అంత సులభం కాదని భారత క్రికెటర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఒత్తిడిలో ఉండటం వల్లే ఆరంభంలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డానని అతను అన్నాడు. రికార్డు డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ ఇంటర్వ్యూ...

 విరామం తర్వాత బరిలోకి దిగడం, ఈ స్థాయిలో చెలరేగడం ఎలా సాధ్యమైంది?
ఈ ఇన్నింగ్స్‌తో నేను గాడిలో పడటం ఎంతో ముఖ్యమని నాకు తెలుసు. రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం వల్ల కొంత ఒత్తిడిలోనే ఉన్నాను. అయితే మరో ఎండ్‌లో రహానే స్వేచ్ఛగా ఆడి పరుగులు చేయడం నాకు ధైర్యాన్నివ్వడంతో పాటు పిచ్ పరిస్థితీ తెలిసొచ్చింది. చూస్తే రెండు నెలలు స్వల్ప వ్యవధి అనిపించవచ్చు గానీ... పునరాగమనంలో బాగా ఆడటం అంత సులువు కాదు.  ఒక్కసారి అర్ధ సెంచరీ పూర్తి కాగానే బ్యాట్ ఝళిపించాను. ఆ ఆట ఏమిటో నాకు బాగా తెలుసు. ముందుగా చిన్న మైలురాళ్లను నిర్దేశించుకొని పెంచుతూ పోయాను. 50 ఓవర్లు ఆడటం సంతృప్తినిచ్చింది.

బ్యాటింగ్ పవర్ ప్లేలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. ఇన్నింగ్స్‌కు అదే కీలక మలుపుగా భావించవచ్చా?
అవును కెప్టెన్ అద్భుతమైన ఎత్తుగడ అది. పవర్‌ప్లే కొన్ని సార్లు అనుకూలంగా, కొన్ని సార్లు ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. అయితే ఆ సమయంలో అడ్డదిడ్డంగా కాకుండా తెలివిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మేమిద్దరం సాంకేతికంగా చక్కటి షాట్లు ఆడాం. ఈ మైదానం గురించి నాకు బాగా తెలుసు. అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. ఒక్కసారి ఫీల్డర్ల మధ్యలోంచి బంతిని పంపామంటే అది ఖచ్చితంగా బౌండరీగా మారుతుంది.

సెంచరీకి ముందు మరింత స్వేచ్ఛగా ఆడినట్లుంది?
నేను అలవోకగా బ్యాటింగ్ చేసిన మాట వాస్తవం. కానీ నిజాయితీగా చెప్పాలంటే సెంచరీ చేయటం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. జట్టుకు భారీ స్కోరును అందించడంలోనే నా దృష్టి ఉంది. 10-15 ఓవర్లు మేం నిలబడితే కనీసం 300 పరుగులు...25-30 ఓవర్ల వరకు ఉంటే 350 పరుగులు సాధ్యమవుతుందని నాకు తెలుసు. ఆ తర్వాత లక్ష్యం పెంచుకుంటూ పోయాము.

ఇన్నింగ్స్ చివరి దశలో మరీ జాగ్రత్తగా కాకుండా ఇక ఎలా ఆడినా పర్వాలేదు, బ్యాటింగ్ కొనసాగిస్తే చాలు అనిపించలేదా?
 నా ఆలోచన కాస్త భిన్నంగా ఉంది. ఇన్నింగ్స్ సమయంలో చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకుంటాను. వాటి గురించి మనసులో ఆలోచిస్తూనే ఉంటాను. ఏ బౌలర్‌నైతే బాగా ఆడగలనో వారిపై గురి పెడతా. కొంత మంది యార్కర్లు బాగా వేస్తారని తెలుసు. వారి బౌలింగ్‌లో ఎలా ఆడాలనేదానిపై మరి కాస్త జాగ్రత్త పడతాను. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఇలాంటి ఆలోచనలన్నీ నా మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నాయి.

48వ ఓవర్లో కులశేఖర బౌలింగ్‌లో ఆడిన అద్భుతమైన షాట్ ఎలా సాధ్యమైంది?
ఆ సమయంలో సర్కిల్ లోపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. వారిని దాటించాలని ముందే నిర్ణయించుకున్నా. ధోని అంత బలంగా నేను బంతిని బాదలేను. కానీ ఫీల్డింగ్ ఖాళీల మధ్యలోంచే బంతిని పంపించగలగడం నా బలం. దాన్ని నమ్ముకొనే ఆ షాట్ ఆడాను. అది పని చేసింది.

కెరీర్‌లో ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి?
నా చిన్నప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకున్నాను. ఇలాంటిది సాధ్యమవుతుందని ఏనాడూ ఊహించలేదు. ఆటతో పాటు అన్ని రికార్డులూ వస్తాయి. ఇకపై ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే నాపై అంచనాలు పెరిగిపోతాయి. నా బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి కెరీర్‌లో సాధించాల్సింది చాలా ఉంది.
 
దక్షిణాఫ్రికాలో పేస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడటం ఎలా అనిపించింది?

కెరీర్‌లో విజయాలు, వైఫల్యాలు సమంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఒకటి రెండు విదేశీ పర్యటనల్లో విఫలమైనంత మాత్రాన నా క్రికెట్‌ను ఆపేయలేను. నా ఆట, నా శ్రమలో తేడా లేదు. ఎప్పటిలాగే మరింత కష్టపడతా.

క్రీజ్‌లో ఉన్నప్పుడు సెహ్వాగ్ రికార్డు గుర్తుకొచ్చిందా?
గత ఏడాది నేను డబుల్ సెంచరీ చేసినప్పుడు 10 పరుగులతో రికార్డు కోల్పోయానని ఎవరో చెప్పారు. బ్యాటింగ్ చేసేటప్పుడు అంతగా ఆ అంకె గుర్తు లేదు. అయితే జట్టు సహచరులు అంతా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఆ రికార్డును దాటానేమో అని అప్పుడు అనిపించింది.

రాబోయే ప్రపంచకప్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి ఆలోచించారా?
దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. మా ఆటగాళ్లంతా ప్రస్తుతానికి చాలా బాగా ఆడుతున్నారు. పైగా ముక్కోణపు సిరీస్‌లో ఆడాక పరిస్థితులు అలవాటు అవుతాయి. నేను ఏ స్థానంలో ఆడాలో నిర్ణయించాల్సింది నేను కాదు. మేనేజ్‌మెంట్ ఎక్కడ ఆడమంటే ఆ స్థానంలో బరిలోకి దిగుతా.

ఈడెన్ గార్డెన్స్ చాలా ప్రత్యేకంగా మారిపోయినట్లుంది?
అవును, మీరు సహకరిస్తే కోల్‌కతాలో ఒక ఫ్లాట్ కూడా కొనేసుకుంటానేమో! ఇక్కడి ప్రజలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఎంతో ప్రత్యేకమైన మైదానం. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడటం చాలా ఇష్టం. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్, టెసుల్లో తొలి సెంచరీ, ఐపీఎల్‌లో సెంచరీ, రంజీలో డబుల్ సెంచరీ, ఇప్పుడు వన్డే డబుల్ సెంచరీ...ఇలా ఈడెన్‌తో చాలా అనుబంధం పెనవేసుకుపోయింది.

>
మరిన్ని వార్తలు