దిగ్గజాలకు జీవితంలో తీరని కోరిక!

4 Sep, 2016 11:15 IST|Sakshi
దిగ్గజాలకు జీవితంలో తీరని కోరిక!

కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్‌కి కెరీర్‌లో తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందట. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన విదేశీ బౌలర్, శతకం సాధించిన విదేశీ బ్యాట్స్‌మెన్ల పేర్లను వారి గౌరవార్థం బోర్డుపై రాస్తారు. కెరీర్‌లో 104 టెస్టు మ్యాచ్‌లాడిన వసీం అక్రమ్ 25 సార్లు ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసినా లార్డ్స్ మైదానంలో మాత్రం ఈ మైలురాయిని అందుకోలేకపోయాడు.

1992లో లార్డ్స్లో 4/66 అక్రమ్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. అక్రమ్ బంతితో అక్కడ విఫలమైనా బ్యాట్‌తో మాత్రం రాణించాడు. 138 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఒకానొక దశలో 95/8తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. అక్రమ్(45 నాటౌట్), వకార్ యూనిస్(20 నాటౌట్)తో కలిసి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందించాడు. ‘అదో చరిత్రాత్మక టెస్టు మ్యాచ్. నా కెరీర్‌లో జింబాబ్వేపై 257 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసినా.. లార్డ్స్లో జట్టు గెలుపు కోసం చేసిన 45 పరుగులే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చాయి. 25 సార్లు ఐదు వికెట్లు తీసినా లార్డ్స్లో మాత్రం ఒకసారి కూడా ఆ మైలురాయిని చేరుకోలేకపోవడం నా కెరీర్‌లో తీరని లోటు’ అని అక్రమ్ వివరించాడు.

లార్డ్స్ లోని బోర్డుపై తమ పేరు చూసుకోవాలని చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అందులో ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండూల్కర్ (భారత్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), బ్రియాన్ లారా (వెస్టిండీస్), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక) లాంటి హేమాహేమీలు కూడా ఉండటం కొసమెరుపు.

మరిన్ని వార్తలు