నాలో ఇగో ప్రశ్నించింది: కోహ్లి

28 Nov, 2019 15:05 IST|Sakshi

న్యూఢిల్లీ:  వన్డే వరల్డ్‌కప్‌-2019లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఓటమి చెందడం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. గ్రూప్‌ స్టేజ్‌లో టాప్‌లో నిలిచి, కీలకమైన నాకౌట్‌ పోరులో ఓటమి పాలు కావడం కోహ్లి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంలో తాను కూడా ఉన్నానన్నాడు. తన అతి విశ్వాసమే ఆ మ్యాచ్‌లో ఫెయిల్యూర్‌ కావడానికి కారణమన్నాడు. ‘ ఆ వరల్డ్‌కప్‌ ఓటమి నాపై తీవ్ర ప్రభావం చూపింది. నేను చాలా ఎఫెక్ట్‌ అయ్యా. జట్టు సభ్యులు కూడా ఆ పరాభవం బారిన పడ్డారు. జట్టుకు నా అవసరం ఉందని నాకు తెలుసు. నేను క్రీజ్‌లో బ్యాటింగ్‌కు వెళ్లేవరకూ బలమైన ఫీలింగ్‌తో ఉన్నా. ఆ మ్యాచ్‌లో నాటౌట్‌గా ముగిస్తానని నమ్మకం ఉంది.

భారత జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన సమయంలో నాపై నేను చాలా విశ్వాసంతో ఉన్నా. కానీ విఫలమయ్యా. మనం దేన్నైనా ముందుగా అంచనా వేయలేమని నాలోని ఇగో ప్రశ్నించింది. నేను ఓడిపోవడాన్ని అసహ్యించుకుంటాను. నేను చేయాల్సి పనిని కూడా చేయలేకపోతే నాలో నిస్సత్తువ ఏర్పడుతుంది. నేను పెవిలియన్‌కు వెళ్లేటప్పుడు జీరో ఎనర్జీతో ఉన్నా. భవిష్యత్తు తరాలకు మన ఆట ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆడాలి’ అని కోహ్లి తెలిపాడు.  ఆ మ్యాచ్‌లో కోహ్లి ఒక పరుగుకే ఔట్‌ కాగా, అంతకుముందు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు కూడా తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరారు. కాకపోతే రవీంద్ర జడేజా(77), ఎంఎస్‌ ధోని(50)లు పోరాడిన మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. భారత జట్టు 221 ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసింది. ఇక వెస్టిండీస్‌ జట్టు భారత పర్యటనకు సంబంధించి కోహ్లి  మాట్లాడుతూ.. విండీస్‌ జట్టు అత్యుత్తమ జట్టుగా పేర్కొన్నాడు. తాము ప్రస్తుతం టాప్‌ లెవెల్‌ ఉన్నా ప్రత్యర్థి విండీస్‌ను తక్కువ అంచనా వేయడం లేదన్నాడు.

మరిన్ని వార్తలు