దేశం కోసం ఆడాలనుకోను: మురళీ విజయ్‌

31 Aug, 2019 16:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  ‘నేను కేవలం జట్టు కోసమే కాదు.. దేశం కోసమూ ఆడతా’ ఇటీవల టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య ఇది.  ‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు.  అది కెప్టెన్‌ విరాట్ అయినా‌, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే’ అని రవిశాస్త్రి  కామెంట్‌కు కౌంటర్‌గా రోహిత్‌ ఇలా వ్యంగ్యంగా స్పందించడం కొన్ని రోజుల క్రితం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే ఇప్పుడు టీమిండియా క్రికెటర్‌ మురళీ విజయ్‌ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.  తాను దేశం కోసం మాత్రమే ఆడాలని భావించనని, ప్యాషన్‌తో మాత్రమే క్రికెట్‌ను ఆడతానన‍్నాడు.

అది ఏ జట్టు అనేది తనకు అనవసరమన్నాడు. తాను ఏ జట్టు కోసం ఆడినా  ఆటపై ఉన్న అభిమానంతో మాత్రమే ఆడతానన్నాడు. ఉన్నత స్థాయి క్రికెట్‌ ఆడటమే తన లక్ష్యమన్నాడు. ఇక్కడ జట్లు అనేవి తనకు ప్రాధాన్యత ఉండదన్నాడు. ఏ తరహా క్రికెట్‌ ఆడాల్సి వచ్చినా తన వరకు న్యాయం చేయడంపైనే దృష్టి సారిస్తానన్నాడు.  సుమారు 15 ఏళ్లుగా క్రికెట్‌ను ఇదే తరహాలో ఆస్వాదిస్తూ ముందుకు వెళుతున్నానని విజయ్‌ పేర్కొన్నాడు. తనకు వచ్చే అవకాశాలు ఎప్పుడూ కూడా మరింత అనుభవాన్ని ఇచ్చాయని, దాన్నే ముందుకు తీసుకెళ్లడానికి ఎల్లప్పుడూ యత్నిస్తానన్నాడు.

గతేడాది డిసెంబర్‌లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన విజయ్‌.. ఇప్పటికీ రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో మురళీ విజయ్‌కు చోట దక్కలేదు.ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ఇప్పుడు జట్టులో కొనసాగుతుండటంతో విజయ్‌కు ఉద్వాసన తప్పలేదు. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు ఇవ్వడంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతోనే విజయ్‌ ఇలా సీరియస్‌ కామెంట్‌ చేయాల్సి వచ్చిందేమో.

మరిన్ని వార్తలు